Monday 22nd June 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఒకే కుటుంబంలో ముగ్గురు వేర్వేరు పార్టీల నుంచి పోటీ.. ఫలితం ఏమైందంటే!

ఒకే కుటుంబంలో ముగ్గురు వేర్వేరు పార్టీల నుంచి పోటీ.. ఫలితం ఏమైందంటే!

martin family

Santiago Martin family in TN Elections | తమిళనాడులో లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ కుటుంబానికి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ‘పొలిటికల్ లాటరీ’ తగిలింది. గతంలో ఎన్నికల బాండ్ల ద్వారా ప్రధాన రాజకీయ పార్టీలకు భారీగా విరాళాలు ఇచ్చి దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన మార్టిన్.. ఇప్పుడు నేరుగా తన కుటుంబ సభ్యుల ద్వారా తమిళనాడు, పుదుచ్చేరి రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సిద్ధమయ్యారు.

ఆయన భార్య, కుమారుడు, అల్లుడు మూడు వేర్వేరు పార్టీల తరఫున పోటీ చేసి అఖండ విజయాలను నమోదు చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

మార్టిన్ కుమారుడు, రూ. 600 కోట్లకు పైగా ఆస్తులు కలిగిన జోస్ ఛార్లెస్ మార్టిన్ పుదుచ్చేరిలోని కామరాజ్ నగర్ స్థానంలో సంచలన విజయం సాధించారు. గతంలో 9 ఏళ్ల పాటు బీజేపీలో పనిచేసిన ఆయన, సీటు కేటాయింపు జాప్యం వల్ల బయటకు వచ్చి 2025 డిసెంబర్‌లో లత్చీయ జననాయగ కచ్చి (LJK) పార్టీని స్థాపించారు. ఎన్డీయే కూటమి తరఫున పోటీ చేసిన ఆయన కాంగ్రెస్, టీవీకే అభ్యర్థులపై 10,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు.

“పుదుచ్చేరిని సింగపూర్, హాంకాంగ్‌లా మార్చడమే నా లక్ష్యం, రాజకీయాలను ప్రభావితం చేసే ఉద్దేశం మా కుటుంబానికి లేదు” అని ఆయన స్పష్టం చేశారు.

డీఎంకే కంచుకోట లాల్‌గుడి‌లో భార్య లీమారోస్ మార్టిన్ గెలుపు..
శాంటియాగో మార్టిన్‌ భార్య లీమారోస్ మార్టిన్ తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లా లాల్‌గుడి స్థానంలో అన్నాడీఎంకే తరఫున విజయఢంకా మోగించారు. గత రెండు దశాబ్దాలుగా డీఎంకే కంచుకోటగా ఉన్న ఈ సీటును ఆమె కైవసం చేసుకోవడం విశేషం. టీవీకే అభ్యర్థి క్యుపా కృష్ణన్‌పై 2,739 ఓట్ల తేడాతో గెలిచిన లీమారోస్ ఆస్తుల విలువ అఫిడవిట్ ప్రకారం రూ. 1,049 కోట్లు. ఈమె ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందే అన్నాడీఎంకేలో చేరడం గమనార్హం.

విజయ్ పార్టీ (TVK) లో నంబర్ 2..
శాంటియాగో మార్టిన్‌ అల్లుడు, దాదాపు రూ. 535 కోట్ల ఆస్తులు ఉన్న ఆధవ్ అర్జున తమిళనాడులోని విక్కివక్కం స్థానంలో హీరో విజయ్‌కు చెందిన టీవీకే పార్టీ తరఫున పోటీ చేసి భారీ విజయాన్ని అందుకున్నారు. సమీప ప్రత్యర్థి డీఎంకే అభ్యర్థి కార్తీక్ మోహన్‌పై 17,302 ఓట్ల తేడాతో ఆయన నెగ్గారు.

టీవీకేలో ప్రధాన కార్యదర్శిగా (ఎన్నికల ప్రచార నిర్వహణ విభాగం) వ్యవహరిస్తున్న ఆధవ్ అర్జున.. పార్టీలో నంబర్ 2 నేతగా, విజయ్ తర్వాత అత్యంత కీలక శక్తిగా ఎదిగారు. పార్టీ ఏదైనా, సిద్ధాంతం ఏదైనా.. తమిళనాడు మరియు పుదుచ్చేరి అసెంబ్లీలలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కోటీశ్వరులు అడుగుపెడుతుండడం, రాబోయే రోజుల్లో వీరు అక్కడి రాజకీయాలను ఏ విధంగా శాసించబోతున్నారనే ఉత్కంఠను రేపుతోంది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions