- క్రికెటర్ నుండి పోలీస్ బాస్ వరకు.. ఆయన ప్రస్థానం ఇదే!
CV Anand Appointed As TG DGP | తెలంగాణ తెలంగాణ నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ నియమితులయ్యారు.
ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి ఏప్రిల్ 30న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో మే 1 న సీవీ ఆనంద్ కొత్త డీజీపీగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు.
35 ఏళ్ల సుదీర్ఘ సర్వీసులో అనేక సంచలన నిర్ణయాలు, సంస్కరణలతో పోలీసింగ్ వ్యవస్థలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు సీవీ ఆనంద్.
సీవీ ఆనంద్ ప్రస్థానం ఇదీ..
1968, మే 5న హైదరాబాద్ లోన పేట్ల బుర్జు ప్రభుత్వ మెటర్నిటీ ఆసుపత్రిలో చామ దామోదర్ రెడ్డి యశోదా దేవి దంపతులకు సీవీ ఆనంద్ జన్మించారు. దామోదర్ రెడ్డి ఐఎఫ్ఎస్ అధికారిగా (IFS) పనిచేశారు.
వీరి స్వస్థలం రంగారెడ్డి జిల్లా హయత్ నగరం మండలంలోని కుంట్లూరు.
సీవీ ఆనంద్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (బేగంపేట)లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. నిజాం కాలేజీలో డిగ్రీ, ఉస్మానియాలో ఎం.ఏ ఎకనామిక్స్ పూర్తి చేశారు.
క్రీడా రంగంలో రాణింపు..
సీవీ ఆనంద్ కేవలం పోలీస్ అధికారి మాత్రమే కాదు, అద్భుతమైన క్రీడాకారుడు కూడా. హైదరాబాద్ అండర్-19 జట్టుకు కెప్టెన్సీ వహించి ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లారు.
రంజీ ట్రోఫీకి ఎంపికయ్యే తరుణంలో సివిల్ సర్వీసెస్ వైపు మళ్లారు. 22 ఏళ్ల చిన్న వయసులోనే మొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్ సాధించి సత్తా చాటారు.
సర్వీసులో కీలక మైలురాళ్లు..
వరంగల్, బెల్లంపల్లి, నిజామాబాద్‌లలో పనిచేసిన సమయంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ధైర్యసాహసాలు ప్రదర్శించి ‘ప్రెసిడెంట్ గ్యాలంట్రీ మెడల్’ అందుకున్నారు.
హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ సీపీగా ఉన్నప్పుడు ఈ-చలాన్, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, హెచ్‌టీఆర్‌ఐఎంఎస్ సిగ్నలింగ్ వంటి విప్లవాత్మక మార్పులు తెచ్చారు.
సైబరాబాద్ సీపీగా..
షీ టీమ్స్ (SHE Teams), షీ షటిల్స్ వంటి కార్యక్రమాలతో మహిళా భద్రతలో కొత్త ఒరవడి సృష్టించారు. 2 లక్షల సీసీటీవీల ఏర్పాటుతో నిఘా నీడను పెంచారు.
సివిల్ సప్లైస్ కమిషనర్‌గా సేవలు అందించిన ఆయన ఈ-పాస్ (e-POS) యంత్రాల ద్వారా రేషన్ బియ్యం పంపిణీలో అవినీతిని అరికట్టి వేల కోట్ల రూపాయలను ప్రభుత్వానికి ఆదా చేశారు. దీనికి జాతీయ స్థాయిలో ఈ-గవర్నెన్స్ అవార్డు లభించింది.
రెండు పర్యాయాలు హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పనిచేసి గణేష్ నిమజ్జనం, బక్రీద్ వంటి పండుగలను శాంతియుతంగా నిర్వహించి మత సామరస్యాన్ని కాపాడారు.
అవార్డులు – పురస్కారాలు..
ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ (2002) ఇండియన్ పోలీస్ మెడల్ (2007) ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ (2017) వరల్డ్ పోలీస్ సమ్మిట్ (దుబాయ్) – యాంటీ నార్కోటిక్స్ అవార్డు (2025)
వ్యక్తిగత జీవితం..
సీవీ ఆనంద్ భార్య లలిత ఆనంద్. వీరికి ఇద్దరు కుమారులు మిలింద్, నిఖిల్. మిలింద్ అండర్-19 వరల్డ్ కప్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. నేటికీ సి.వి. ఆనంద్ సికిందరాబాద్ క్లబ్ తరఫున క్రికెట్ ఆడుతూ సెంచరీలు బాదడం ఆయన ఫిట్‌నెస్‌కు నిదర్శనం.






