Saturday 6th June 2026
12:07:03 PM
Home > తాజా > ‘లక్ష కోట్ల భూములను కాంగ్రెస్ పెద్దలకు కట్టబెడుతున్నారు’

‘లక్ష కోట్ల భూములను కాంగ్రెస్ పెద్దలకు కట్టబెడుతున్నారు’

  • ఆధారాలతో సహా బయటపెడతా: కల్వకుంట్ల కవిత

TRS President Kalvakuntla Kavitha Press Meet ఁ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ. లక్ష కోట్ల విలువైన ప్రభుత్వ భూములను బడాబాబులకు కట్టబెడుతోందని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు, మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు బందిపోట్ల మాదిరిగా రాష్ట్ర సంపదను దోచుకుంటున్నారని ఆరోపించారు.

వాళ్ల భూదందాలను వరుసబెట్టి సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందు ఉంచుతామని ఆమె హెచ్చరించారు. బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు.

హైడ్రా ఒక బూచి.. సెలెక్టివ్ దాడులపై సవాల్..
హైడ్రా అనే సంస్థను బూచిగా చూపిస్తూ పాలకులు భూదందాలకు పాల్పడుతున్నారని కవిత విమర్శించారు.  హైడ్రా సంస్థ కూకట్‌పల్లిలోని మంజీర కాలనీకి వెళ్లి పేదల భూములను ఖాళీ చేయించిందని, కానీ మూసీ రివర్ బెడ్‌లో నిబంధనలకు విరుద్ధంగా కడుతున్న ‘శ్రీ ఆదిత్య భవనాన్ని’ మాత్రం టచ్ చేయడం లేదని మండిపడ్డారు. ఈ బిల్డర్స్ వెనుక ఒక కాంగ్రెస్ ఎంపీ ఉన్నారని, ఆయన పేరు త్వరలోనే బయటపెడతానని చెప్పారు.

చెరువుల కబ్జాపై సవాల్..
ప్రేమవతి పేట పెద్ద చెరువులో ఏడు ఎకరాల (రూ. 700 కోట్ల విలువైన) శిఖం భూమిని కబ్జా చేసి 30 అంతస్తుల భవనం కడుతున్నారని, దీనిపై హైడ్రాకు చర్యలు తీసుకునే దమ్ముందా అని సవాల్ విసిరారు.

అలాగే నాగారం మున్సిపాలిటీ పరిధిలోని మేడి బావి, జాలు బావి చెరువుల వద్ద సర్వే నంబర్ 59 లో ఐకాం అనే సంస్థ ఐదు ఎకరాలు కబ్జా చేసినట్లు మున్సిపాలిటీలో తీర్మానం చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

పవన్ కళ్యాణ్ 10 ఎకరాల శిఖం భూమి వెనక్కి ఇవ్వాలి..
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణలో కొనుగోలు చేసిన భూములపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ కోడికుంట అనే చెరువులో సర్వే నంబర్ 706 లో 10 ఎకరాల శిఖం భూమిని కొన్నారని, దీనిని ఇరిగేషన్ శాఖ కూడా నోటిఫై చేసిందని తెలిపారు.

రిజిస్ట్రేషన్‌లో తప్పులు చేసి మూడు ఎకరాలే శిఖం అని, మిగతాది మాగాణి అని చూపించారన్నారు. శిఖం భూములు కొన్న పవన్ కళ్యాణ్ ఆ 10 ఎకరాలను వెంటనే ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇచ్చినట్లే ఆయనకు కూడా నష్టపరిహారం ఇవ్వాలన్నారు.

గద్దరన్నకు కారు కొనిచ్చానని పవన్ కళ్యాణ్ ప్రచారం చేసుకోవడం జానపద కళాకారులను అవమానించడమేనని విమర్శించారు.
 
గతంలో అవినీతికి బీఆర్ఎస్ కిటికీలు తెరిస్తే, రేవంత్ రెడ్డి ఏకంగా తలుపులు తెరిచారని కవిత ఎద్దేవా చేశారు. “అప్పుడు కేటీఆర్ పాలనే ఉంది.. ఇప్పుడు కేటీఆర్ పాలనే ఉంది.

గతంలో కేటీఆర్ అంటే కేసీఆర్, తన్నీరు హరీష్ రావు, రామారావు. కానీ ఇప్పుడు కేటీఆర్ పాలన అంటే కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి” అంటూ సీఎం కుటుంబ సభ్యులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫీనిక్స్ సంస్థకు 50 ఎకరాలు ఇస్తే వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక మరో వంద ఎకరాలు కలిపి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌కు ఇదే ఆఖరి సర్కార్ అని, రేవంత్ రెడ్డి తీరు చూస్తుంటే మరో 20 ఏళ్లు ఆ పార్టీని బొందపెట్టేలా ఉందని వ్యాఖ్యానించారు.

పాలమూరు బిడ్డ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత 30 నెలలుగా పాలమూరు ప్రాజెక్టులపై ఒక్క రివ్యూ కూడా చేయలేదని, తాము ధర్నాలు చేస్తేనే మొదటిసారి సమీక్షించారని కవిత పేర్కొన్నారు. సీఎంకు నీటి సబ్జెక్టుపై అవగాహన లేదని, ఆంధ్రాకు 260 టీఎంసీల నీళ్లు తీసుకోమని చెప్పడం తెలంగాణకు ద్రోహం చేయడమేనన్నారు.

పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, తన గురువైన చంద్రబాబు నాయుడిని కలిసి కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావలసిన 200 టీఎంసీల నీటిని అడగాలని హితవు పలికారు.

బనకచర్లకు అంగీకరిస్తే నీటి ద్రోహం చేసినట్లేనన్నారు. చివరగా, ఉద్యమకారులను గుర్తించే అఖిలపక్ష సమావేశానికి తమను పిలవకపోవడాన్ని ప్రభుత్వం విజ్ఞతకే వదిలేస్తున్నానని, ఉద్యమకారులకు ఉప్పల్ భగాయత్, నాదర్ గుల్‌లోని 200 ఎకరాల భూములను కేటాయించాలని, దీనికోసం వచ్చే నెల ఉప్పల్ భగాయత్‌లో పెద్ద ఎత్తున భూపోరాటం చేయబోతున్నామని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.

You may also like
harish rao
కేసీఆర్ ఆఫీసులో రేవంత్ ఫోటో.. హరీష్ హాట్ కామెంట్స్!
కేసీఆర్ క్యాంప్ ఆఫీసులో సీఎం రేవంత్ ఫోటో.. గజ్వేల్‌లో హై టెన్షన్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions