CM Revanth On TG Budget :2026-27 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఇది కేవలం అంకెట గారడీ కాదని, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ‘ఫ్యూచరిస్టిక్ బడ్జెట్’ అని ఆయన అభివర్ణించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం కుండబద్ధలు కొట్టారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేసిన అప్పు ₹3.47 లక్షల కోట్లు.
ఇందులో సింహభాగం అంటే ₹3.30 లక్షల కోట్లు కేవలం గత ప్రభుత్వం చేసిన అప్పులు మరియు వాటి వడ్డీలు చెల్లించడానికే ఖర్చయ్యాయని ఆయన వివరించారు.
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి భరోసా ఇచ్చేలా ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ తెచ్చామని, ఇది దాదాపు 1.15 కోట్ల కుటుంబాలకు వర్తిస్తుందని చెప్పారు. ₹5 లక్షల బీమా పరిహారం అందించడం దేశంలోనే ఇది మొదటిసారి అని గర్వంగా ప్రకటించారు.
జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా రాష్ట్రంలో సంస్కరణలు తెస్తున్నట్లు వెల్లడించారు. ప్రీ-ప్రైమరీ నుంచి ప్లస్ టూ (+2) వరకు విద్యార్థులు ఒకే ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో చదువుకునే కొత్త విధానాన్ని అమలు చేయబోతున్నట్లు తెలిపారు.
రాష్ట్ర ఖజానాను నింపేందుకు వివిధ విభాగాల్లో ఉన్న అవినీతి, లీకేజీలను అరికడుతున్నామని, కేంద్రం నుంచి రావాల్సిన నిధులను ఎప్పటికప్పుడు రాబట్టుకుంటున్నామని సీఎం స్పష్టం చేశారు.
“అభివృద్ధి, సంక్షేమానికి మేము సమాన ప్రాధాన్యతనిచ్చాం. మౌలిక వసతుల కల్పన ద్వారా ఆర్ధిక వృద్ధిని సాధించడమే మా లక్ష్యం.” అని సీఎం తెలిపారు.







