- మరో భారీ అర్బన్ ఫారెస్ట్ పార్క్ ఏర్పాటుకు అటవీ శాఖ కసరత్తు
Gurram Guda Forest Land | ఎన్నో ఏళ్లుగా న్యాయ వివాదాల్లో చిక్కుకున్న అమంగల్ డివిజన్ పరిధిలోని గుర్రం గూడ అటవీ (Gurram Guda Forest) ప్రాంతాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించింది.
మొత్తం 424 ఎకరాలు 31 గుంటల విస్తీర్ణం గల ఈ అటవీ భూభాగాన్ని తెలంగాణ ఫారెస్ట్ చట్టం–1967లోని సెక్షన్ 15 ప్రకారం రిజర్వ్ ఫారెస్ట్‌గా గుర్తిస్తూ పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ G.O.Ms.No.7 (తేదీ: 09-03-2026) ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో ఈ ప్రాంతానికి సంబంధించిన చట్టపరమైన ప్రక్రియ పూర్తై, అటవీ భూములకు అధికారికంగా రిజర్వ్ ఫారెస్ట్ హోదా లభించిందని అటవీ దళాల ముఖ్య సంరక్షిణాధికారి డాక్టర్ సీ. సువర్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిర్ణయంతో ఆ అటవీ భూములకు మరింత బలమైన చట్టపరమైన రక్షణ లభించనుందన్నారు.
ఈ విస్తీర్ణంలో భాగమైన సాహెబ్‌నగర్ కలాన్ గ్రామంలోని సర్వే నంబర్ 201/1లోని 102 ఎకరాలు చాలా కాలంగా న్యాయ వివాదంలో ఉన్నాయని, “సాహెబ్‌నగర్ కలాన్ కేసు”గా ప్రసిద్ధి చెందిన ఈ వ్యవహారం దీర్ఘకాలం పాటు వివిధ న్యాయస్థానాల్లో విచారణకు రాగా అటవీ అధికారుల కృషి, ప్రభుత్వ మద్దతువలన చివరకు అటవీ శాఖ వాదనను సుప్రీంకోర్టు సమర్థిస్తూ తీర్పు ఇవ్వడం జరిగిందన్నారు..
తద్వారా అటవీ భూములను ఆక్రమణలు, అనధికార హక్కుల నుంచి కాపాడాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటించిందని ఆమె తెలిపారు. ఈ తీర్పుతో ఆ భూములపై ప్రభుత్వ హక్కులు మరింత బలపడ్డాయని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని భారీ అర్బన్ ఫారెస్ట్ పార్క్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించిందని, హైదరాబాద్ నగరంలో వేగంగా పెరుగుతున్న నగరీకరణ నేపథ్యంలో పచ్చని ప్రదేశాల అవసరం పెరుగుతున్న పరిస్థితిలో ఈ పార్క్ నగర ప్రజలకు ముఖ్యమైన గ్రీన్ స్పేస్‌గా మారనుందన్నారు.
ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించేందుకు, పర్యావరణంపై అవగాహన పెంపొందించేందుకు, కుటుంబాలతో కలిసి విశ్రాంతి తీసుకునేందుకు ప్రజలకు అనువైన ప్రదేశంగా దీనిని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అటవీ భూముల సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ఆక్రమణలను అరికట్టడంలో కఠిన చర్యలు తీసుకుంటోందన్నారు.
అదే సమయంలో హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో అర్బన్ ఫారెస్ట్ పార్కులు, గ్రీన్ లంగ్ స్పేస్‌లను విస్తరించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతోందని పేర్కొన్నారు.
గుర్రం గూడ అటవీ ప్రాంతాన్ని రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించడం కూడా ఆ దిశలో తీసుకున్న కీలక నిర్ణయంగా పేర్కొన్నారు.










