TG Lifts Ban On Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. గత కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్యోగుల బదిలీలపై (Transfers) నిషేధాన్ని ఎత్తివేస్తూ మంగళవారం ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
సాధారణ బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ఈ నిర్ణయం పెద్ద ఊరట. ప్రధానంగా విద్యాశాఖతో పాటు ఇతర శాఖల్లోని ఉద్యోగుల బదిలీలకు ఈ ఉత్తర్వులతో మార్గం సుగమమైంది. బదిలీల ప్రక్రియ అంతా అత్యంత పారదర్శకమైన కౌన్సెలింగ్ పద్ధతిలో జరగాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
భార్యాభర్తలు ఒకే చోట పనిచేసే ‘స్పౌజ్’ (Spouse) కేసులు, తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నవారికి బదిలీల్లో ప్రాధాన్యత లభించనుంది. తమ ప్రాంతాలకు లేదా అనుకూలమైన ప్రదేశాలకు వెళ్లాలనుకునే వేల మంది ఉద్యోగులు ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
షెడ్యూల్ విడుదల..
బదిలీలపై ఉన్న నిషేధాన్ని సడలిస్తూ, పూర్తి స్థాయి మార్గదర్శకాలను విడుదల చేసింది. మే 1 నుంచి మే 31, 2026 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది.
ముఖ్యమైన నిబంధనలు ఇవే..
ఒకే చోట కనీసం 3 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులు బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకే చోట 4 ఏళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు బదిలీ తప్పనిసరి. వచ్చే ఏడాది (మే 31, 2027) లోపు పదవీ విరమణ పొందే వారికి బదిలీ నుంచి మినహాయింపు ఉంటుంది. ఒక్కో కేడర్‌లో గరిష్టంగా 40% మందిని మాత్రమే బదిలీ చేస్తారు.
ప్రాధాన్యత ఎవరికంటే..
క్యాన్సర్, కిడ్నీ సంబంధిత వ్యాధులు, గుండె శస్త్రచికిత్స చేయించుకున్న వారికి మొదటి ప్రాధాన్యత. భార్యాభర్తలు ఒకే చోట పనిచేసేందుకు (Spouse cases) మరియు వికలాంగులకు ప్రాధాన్యత ఉంటుంది. మారుమూల లేదా కష్టతరమైన ప్రాంతాల్లో ఎక్కువ కాలం పనిచేసిన వారికి వారు కోరుకున్న చోటికి బదిలీ ఇస్తారు.
బదిలీల ప్రక్రియ ఇలా సాగుతుంది..
బదిలీలు పూర్తిగా ఆన్‌లైన్/వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ పద్ధతిలో జరుగుతాయి. అర్హులైన ఉద్యోగుల నుంచి గరిష్టంగా 5 ఆప్షన్లను అధికారులు సేకరిస్తారు. బదిలీ ఉత్తర్వులు అందిన 3 రోజుల్లోనే ఉద్యోగి పాత బాధ్యతల నుంచి రిలీవ్ అయినట్లు పరిగణిస్తారు.
కష్ట ప్రాంతాలకు వెళ్లేందుకు ఎవరూ ముందుకు రాని పక్షంలో లాటరీ ద్వారా సిబ్బందిని ఎంపిక చేస్తారు. జూన్ 1 నుంచి మళ్లీ బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుంది. కాబట్టి మే నెలలోనే ఈ ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది.






