Sonusood Helps Neera | వెండితెరపై విలన్‌గా మెప్పించినా.. నిజ జీవితంలో కోట్లాది మందికి ‘దేవుడు’గా మారిన సోనూసూద్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. మృత్యువుతో పోరాడుతున్న ‘నీరా’ అనే చిన్నారికి అండగా నిలిచి, ఆమెకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు.
ఎందరో చేతులెత్తేసినా, సోనూసూద్ చొరవతో జరిగిన శస్త్రచికిత్స విజయవంతమై ఆ చిన్నారి ఇంట చిరునవ్వులు పూయించింది. నీరా అనే చిన్నారి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో ఆమె తల్లి ఎన్నో ఆసుపత్రులు తిరిగింది.
‘రిస్క్ ఎక్కువ.. బతకడం కష్టం’ అంటూ చాలా చోట్ల నిరాశే ఎదురైంది. కానీ, తన బిడ్డను ఎలాగైనా కాపాడుకోవాలన్న ఆ తల్లి పోరాటానికి సోనూసూద్ బలాన్ని ఇచ్చారు. విషయం తెలిసిన వెంటనే స్పందించిన సోనూ, చిన్నారికి మెరుగైన చికిత్స అందించే బాధ్యతను తన భుజాన వేసుకున్నారు.
సోనూసూద్ సహకారంతో నీరాను జూపిటర్ హాస్పిటల్ (Jupiter Hospitals) లో చేర్పించారు. అక్కడ డాక్టర్ ఖలీద్ షేక్, డాక్టర్ అశుతోష్ బృందం అత్యంత క్లిష్టమైన ఈ శస్త్రచికిత్సను సవాలుగా తీసుకున్నారు. అసాధ్యమనుకున్న స్థితి నుంచి చిన్నారిని క్షేమంగా బయటకు తీసుకువచ్చి వైద్య ప్రపంచంలో అద్భుతం చేశారు.
చిన్నారి కోలుకున్నాక సోనూసూద్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. “ఎవరి జీవితంపైనా ఎప్పుడూ ఆశ వదులుకోవద్దు. మనం కలిసి నిలబడితే ఎలాంటి కష్టాలనైనా జయించవచ్చు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన జూపిటర్ హాస్పిటల్ వైద్య బృందానికి కృతజ్ఞతలు” అంటూ ట్వీట్ చేశారు.






