PM Modi Touches Feet Of Old Man | పశ్చిమ బెంగాల్ సీఎంగా సువేందు అధికారి శనివారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు.
ఈ నేపథ్యంలో వేదికపై ఒక ఒక అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. వేదికపై ఉన్న 97 ఏళ్ల సీనియర్ నాయకుడు మఖన్‌లాల్ సర్కార్ పాదాలకు ప్రధాని నరేంద్ర మోదీ నమస్కరించి, ఆయన్ని ఆలింగనం చేసుకున్నారు.
బెంగాల్‌లో బీజేపీ తొలి ప్రభుత్వం కొలువుదీరుతున్న వేళ, పార్టీ పునాదుల కోసం పనిచేసిన పాతతరం నాయకుడికి ప్రధాని ఇచ్చిన గౌరవం అందరినీ ఆకట్టుకుంది.
“బెంగాల్‌లో తొలి బీజేపీ ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేస్తున్న ఈ వేళ డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీని స్మరించుకోవడం మన బాధ్యత. ఈ కార్యక్రమంలో మఖన్‌లాల్ సర్కార్ గారిని కలవడం గర్వంగా ఉంది.
ఆయన శ్యామ ప్రసాద్ ముఖర్జీతో కలిసి పనిచేయడమే కాకుండా, జమ్మూ కాశ్మీర్ పర్యటనలో ఆయనతో ఉండి అరెస్టయ్యారు కూడా. ఇటువంటి స్ఫూర్తిదాయక వ్యక్తులే మన పార్టీ బలం” అని ప్రధాని ‘ఎక్స్’ వేదికగా కొనియాడారు.
సిలిగురికి చెందిన మఖన్‌లాల్ సర్కార్ బీజేపీ తొలి తరం నేతల్లో ఒకరు. 1952లో కాశ్మీర్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే ఉద్యమంలో శ్యామ ప్రసాద్ ముఖర్జీతో పాటు పాల్గొని జైలుకు వెళ్లారు.
1980లో బీజేపీ ఆవిర్భావం తర్వాత సిలిగురి జిల్లాకు తొలి అధ్యక్షుడిగా పనిచేశారు. పశ్చిమ దినాజ్‌పూర్, జల్పాయ్‌గురి, డార్జిలింగ్ జిల్లాల్లో పార్టీ విస్తరణకు అహర్నిశలు శ్రమించారు.
కోర్టులో దేశభక్తి గీతం…
కాంగ్రెస్ హయాంలో దేశభక్తి గీతం పాడినందుకు ఢిల్లీ పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. క్షమాపణలు చెప్పేందుకు నిరాకరించిన ఆయన, జడ్జి కోరిక మేరకు కోర్టులోనే మళ్ళీ ఆ పాట పాడి వినిపించారు.
ఆ పాట విన్న జడ్జి ముగ్ధుడై.. మఖన్‌లాల్‌కు ఫస్ట్ క్లాస్ టికెట్ ఇచ్చి మరీ గౌరవంగా పంపమని పోలీసులను ఆదేశించారు. బెంగాల్ గడ్డపై కాషాయ జెండా: సువేందు అధికారి ప్రమాణస్వీకారంతో బెంగాల్‌లో సరికొత్త రాజకీయ శకం మొదలైంది.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను నెరవేరుస్తామని సువేందు ఈ సందర్భంగా ప్రకటించారు.











