Sunday 10th May 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం.. తొలి సంతకం ఎక్కడంటే!

సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం.. తొలి సంతకం ఎక్కడంటే!

vijay swearing in ceremony

CM Vijay swearing in ceremony | తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త రికార్డు సృష్టిస్తూ.. ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) అధినేత సి. జోసెఫ్ విజయ్ నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం వేదికగా ఆదివారం ఉదయం 10 గంటలకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.

విజయ్‌తో పాటు మరో తొమ్మిది మంది మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే విజయ్ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రధాన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేశారు.

రాష్ట్రంలో గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే ఫైలుపై విజయ్ తన మొదటి సంతకం చేశారు.

అనంతరం మహిళా భద్రతను పటిష్టం చేసే ఫైలుతో పాటు, డ్రగ్స్ రహిత తమిళనాడు దిశగా కఠిన చర్యలు తీసుకునే ఫైలుపై సంతకం చేశారు.

అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని కొనసాగిస్తూ మరింత మెరుగుదల చేసే ఫైలుపై కూడా ఆయన సంతకం చేశారు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రత్యేకంగా హాజరై విజయ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

వీరితో పాటు పొరుగు రాష్ట్రాల నేతలు, సినీ రంగ ప్రముఖులు మరియు వేలాది మంది అభిమానుల మధ్య ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.

శ్రీలంక అధ్యక్షుడి అభినందనలు..
తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్‌కు శ్రీలంక అధ్యక్షుడు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

“శ్రీలంక మరియు తమిళనాడు మధ్య శతాబ్దాల నాటి సాంస్కృతిక, చారిత్రక బంధం ఉంది. రాబోయే రోజుల్లో భారత్-శ్రీలంక మధ్య ఆర్థిక సహకారం మరింత బలోపేతం కావాలని, తమిళనాడుతో సన్నిహిత సంబంధాలు కొనసాగాలని కోరుకుంటున్నాను” అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

విజయ్ అధికార పగ్గాలు చేపట్టడంతో తమిళనాడు అంతటా పండగ వాతావరణం నెలకొంది. అభిమానులు ‘సీఎం విజయ్’ నినాదాలతో చెన్నై వీధులను హోరెత్తిస్తున్నారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions