Modi Visits Somanath Temple | గుజరాత్‌లోని చారిత్రాత్మక సోమనాథ్ క్షేత్రంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు.
భారత్ తన ప్రాచీన సంస్కృతిని గౌరవిస్తూనే, ఆధునిక సాంకేతిక రంగంలో ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగిందని ఆయన స్పష్టం చేశారు.
ముఖ్యంగా సరిగ్గా 28 ఏళ్ల క్రితం (1998) ఇదే రోజున జరిగిన పోఖ్రాన్ అణు పరీక్షలను ప్రస్తావిస్తూ దేశ గౌరవాన్ని చాటారు.
“సోమనాథ్ దేవాలయ అభివృద్ధి వెనుక ఆ పరమశివుడి ఆశీస్సులు ఉన్నాయి. 1951లో ఈ ఆలయ పునర్నిర్మాణం ప్రారంభమైంది. నేడు మనం ఈ క్షేత్ర రూపురేఖలను మరింత అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాం. ఇది కేవలం కట్టడం కాదు, భారత ఆత్మగౌరవ ప్రతీక” అని మోదీ పేర్కొన్నారు.
“సత్యం ఎప్పుడూ ఓడిపోదు. మన పూర్వీకులు ఆచరించి చూపిన ధర్మమే మనకు మార్గదర్శకం. విధ్వంసం సృష్టించే శక్తుల కంటే, నిర్మించే శక్తులే గొప్పవని సోమనాథ్ చరిత్ర మనకు చెబుతుంది” అని వివరించారు.
“1998లో ఇదే రోజున వాజ్‌పేయి గారి నాయకత్వంలో పోఖ్రాన్‌లో భారత్ అణు పరీక్షలు నిర్వహించింది. అప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఆశ్చర్యపోయాయి.
ఆ ఒక్క నిర్ణయంతో భారత్ తన శక్తిని ప్రపంచానికి చాటిచెప్పింది. నేడు మనం జరుపుకుంటున్న నేషనల్ టెక్నాలజీ డే కి ఆ పరీక్షలే స్ఫూర్తి” అని మోదీ కొనియాడారు.
సంస్కృతి-సాంకేతికత మేళవింపు..
ప్రాచీన సంస్కృతిని పరిరక్షించుకుంటూనే, ఆధునిక ఆవిష్కరణల్లో భారత్ అగ్రగామిగా మారుతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు ప్రధాని మోదీ.







