K. A. Sengottaiyan Jayalalithaa photo | తమిళనాడు రాజకీయాల్లో ‘దళపతి’ విజయ్ సరికొత్త శకానికి నాంది పలికారు. అయితే ఆయన కేబినెట్‌లో చోటు దక్కించుకున్న ఒక సీనియర్ మంత్రి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆయనే కె.ఎ. సెంగోట్టయన్.
తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈ దిగ్గజ నేత, నేటికీ తన చొక్కా జేబులో మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత ఫొటోను పెట్టుకుని కనిపించడం విశేషం. అన్నా డీఎంకేలో దశాబ్దాల కాలం పనిచేసిన సెంగోట్టయన్, 2025 నవంబర్‌లో ఆ పార్టీని వీడి విజయ్ స్థాపించిన టీవీకేలో చేరారు.
పార్టీ మారినా, తన ఆరాధ్య దైవంగా భావించే జయలలిత పట్ల తనకున్న భక్తిని ఆయన వీడలేదు. ఆదివారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనూ, నేడు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తున్నప్పుడు కూడా ఆయన జేబులో జయలలిత ఫొటో స్పష్టంగా కనిపించింది.
ఒక కొత్త పార్టీలో ఉంటూ, వేరే పార్టీకి చెందిన మాజీ నాయకురాలి ఫొటోను జేబులో పెట్టుకోవడానికి ముఖ్యమంత్రి విజయ్ అంగీకరించడం ఆయన రాజకీయ పరిణతిని సూచిస్తోంది. సెంగోట్టయన్ అనుభవాన్ని, ఆయన భావోద్వేగాలను గౌరవిస్తూ విజయ్ ఈ విషయంలో ఎటువంటి అభ్యంతరం తెలపలేదు.
కీలక బాధ్యతలు..
గతంలో జయలలిత హయాంలో రెవెన్యూ, పాఠశాల విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన సెంగోట్టయన్‌కు, ఇప్పుడు విజయ్ కేబినెట్‌లో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (PWD) వంటి కీలక శాఖను అప్పగించే అవకాశం ఉందని సమాచారం.
గోబిచెట్టిపాళయం నియోజకవర్గం నుంచి 9వ సారి ఎమ్మెల్యేగా గెలిచిన సెంగోట్టయన్, తమిళనాడు అసెంబ్లీలో అత్యంత అనుభవం ఉన్న నేతలలో ఒకరు. అన్నాడీఎంకేలో అంతర్గత విభేదాల వల్ల ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఆయన, గత ఏడాది విజయ్ చెంతకు చేరారు.







