Salon In ATM | సాధారణంగా ఏటీఎంకి ఎందుకు వెళ్తాం? జేబులో డబ్బులు అయిపోయినప్పుడో లేదా అత్యవసరంగా నగదు కావాల్సి వచ్చినప్పుడో వెళ్తాం. కానీ బీహార్‌లోని పాట్నా (దానాపూర్) వాసులు మాత్రం ఒక ఏటీఎంకి వెళ్తే షాక్ తింటున్నారు.
ఎందుకంటే అక్కడ నగదు ఇచ్చే మెషిన్ మాయమై.. క్షౌరం చేసే సెలూన్ ప్రత్యక్షమైంది!
బయట ఎస్బీఐ.. లోపల సెలూన్..
దానాపూర్‌లోని ఒక ప్రాంతంలో గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఏటీఎం ఉండేది. దాని సెటప్, గ్లాస్ డోర్లు, బయట బోర్డు అన్నీ అలాగే ఉన్నాయి. కానీ లోపల మాత్రం ఇప్పుడు ఒక హేయిర్ కటింగ్ సెలూన్ నడుస్తోంది.
అత్యవసరంగా డబ్బుల కోసం కార్డు చేతిలో పట్టుకుని ఏటీఎం లోపలికి వెళ్తున్న జనం.. అక్కడ అద్దాల ముందు కూర్చుని జుట్టు కత్తిరించుకుంటున్న వారిని చూసి అవాక్కవుతున్నారు.
సదరు ఏటీఎం సెంటర్ కొన్నాళ్ల క్రితం మూతపడింది. ఆ గది యజమాని దానిని ఖాళీగా ఉంచడం ఇష్టం లేక ఒక సెలూన్ నిర్వాహకుడికి అద్దెకు ఇచ్చారు. అయితే సెలూన్ యజమాని లోపల అలంకరణ మార్చాడు కానీ, బయట ఉన్న ఎస్బీఐ బోర్డును మాత్రం అలాగే ఉంచేశాడు.
ప్రస్తుతం ఈ ‘సెలూన్ ఏటీఎం’ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. “డబ్బులు రాకపోయినా ఫర్వాలేదు కానీ.. నీట్ గా తయారై బయటకు రావచ్చు” అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.











