VC Sajjanar On Vulgar Reels In Immersion గణేష్ చతుర్థి ఉత్సవాల పవిత్రతను కాపాడేందుకు హైదరాబాద్ నగర పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉత్సవాల సమయంలో సామాజిక మాధ్యమాల్లో అశ్లీల రీల్స్, శృతిమించిన పాటలు, డ్యాన్సులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.
ఇందులో భాగంగా నగరవ్యాప్తంగా డీజేలు, అధిక శబ్దం వచ్చే సౌండ్ సిస్టమ్‌లపై ఇప్పటికే పూర్తిస్థాయి నిషేధం విధించినట్లు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ వెల్లడించారు.
సోషల్ మీడియా నిఘా కోసం పోలీసు విభాగం 24/7 పర్యవేక్షణ టీమ్‌ను యాక్టివేట్ చేసిందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
ఉత్సవాల అనంతరం డిజిటల్ యాక్షన్..
ప్రస్తుతం పండుగ వాతావరణం ఉన్నందున వెంటనే అరెస్టులు చేయడం లేదని, ఉత్సవాలు ముగిసిన వెంటనే సోషల్ మీడియా రీల్స్, వీడియోలను తవ్వి తీసి ఉల్లంఘనులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు. నగరవ్యాప్తంగా డీజేలు, అధిక సౌండ్ సిస్టమ్‌లపై నిషేధం అమలులో ఉందని, అశ్లీల మరియు రెచ్చగొట్టే పాటలపై కేసులు నమోదు చేస్తున్నామని పేర్కొన్నారు.
తల్లిదండ్రులకు సూచన..
పవిత్రమైన వినాయక చవితి వేడుకల్లో తమ పిల్లలు అశ్లీల పాటలకు డ్యాన్సులు చేయకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని విజ్ఞప్తి చేశారు. గణేష్ మండపాల వద్ద ఎక్కడా అశ్లీల, రెచ్చగొట్టే పాటలు ప్లే చేయకూడదని, ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహించుకోవాలని ఉత్సవ కమిటీలకు సూచించారు.











