- యూట్యూబర్ ఇంట్లో రూ.1 కోటి నగదు, కిలో బంగారం చోరీ
Youtuber House Burglary Nagercoil సోషల్ మీడియాలో లభించే లైక్‌లు, వ్యూస్ కోసం ఇంట్లోని నగదును ప్రదర్శిస్తూ వీడియోలు పోస్ట్ చేయడం ఒక యూట్యూబర్ దంపతులకు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టింది. కట్టల కొద్దీ డబ్బులను మంచంపై పరిచి రీల్స్ తీసి పోస్ట్ చేయడంతో.. దొంగల ముఠా కన్ను వారిపై పడింది. సమయం చూసి ఇంట్లోకి చొరబడిన దుండగులు ఏకంగా కిలో బంగారం, రూ. 1 కోటి నగదును ఎత్తుకెళ్లారు. ఈ దిగ్భ్రాంతికర ఘటన తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్ సమీపంలో చోటుచేసుకుంది.
యూట్యూబర్ దంపతుల హంగామా..
తమ్మట్టుకోణం ప్రాంతానికి చెందిన వినోద్ కుమార్ ఒక ప్రముఖ యూట్యూబర్. ఆయన భార్య మధుమితతో కలిసి క్రమం తప్పకుండా యూట్యూబ్ వీడియోలు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ పోస్ట్ చేస్తుంటారు. ఇటీవల మంచంపై నోట్ల కట్టలను పరుచుకుని తీసిన ఒక వీడియోను మధుమిత సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
పక్కా ప్లాన్‌తో దొంగతనం..
ఈ వీడియోలు దొంగల ముఠా కంటపడటంతో, వారి ఇంట్లో చోరీ చేయాలని ప్లాన్ చేశారు. వినోద్, మధుమిత దంపతులు ఇంటికి తాళం వేసి షాపింగ్‌కు వెళ్లిన సమయాన్ని దొంగలు అనుకూలంగా మార్చుకున్నారు. వెనుక డోర్ ద్వారా సైలెంట్‌గా ఇంట్లోకి చొరబడి కిలో బంగారం, రూ. 1 కోటి నగదును ఎత్తుకెళ్లారు.
షాపింగ్ ముగించుకుని ఇంటికి వచ్చిన దంపతులు చోరీని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.










