- మోటోహాస్తో బిగ్ డీల్!
ప్రముఖ ఇటాలియన్ టూ-వీలర్ బ్రాండ్ ఇటల్జెట్ (Italjet) భారత మార్కెట్లోకి అధికారికంగా ప్రవేశించేందుకు సిద్ధమైంది. దీని కోసం భారతీయ కంపెనీ మోటోహాస్ ఇండియా (Motohaus India) తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. వచ్చే నెల మిలాన్ (ఇటలీ) లో జరగనున్న EICMA 2026 ప్రదర్శన వేదికగా భారత్‌లో తమ ఉత్పత్తుల లైనప్, బిజినెస్ ప్లాన్ మరియు విక్రయాల షెడ్యూల్‌ను వెల్లడించనున్నాయి.
ఇటలీలోని బొలోగ్నాలో ప్రారంభమైన ఇటల్జెట్ సంస్థ.. వినూత్నమైన డిజైన్లు, ఆకర్షణీయమైన ఇంజనీరింగ్‌తో కూడిన స్కూటర్లు, మోటార్‌సైకిళ్లను తయారు చేయడంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.
ఉత్పత్తుల లైనప్..
ఇటల్జెట్ ప్రస్తుతం 125 సీసీ నుంచి 700 సీసీ వరకు సామర్థ్యం ఉన్న హై-పెర్ఫార్మెన్స్ స్కూటర్లను తయారు చేస్తోంది. ఇందులో ప్రాచుర్యం పొందిన ‘ఇటల్జెట్ డ్రాగ్‌స్టర్’ (Dragster) సిరీస్‌తో పాటు కొత్తగా వచ్చిన ‘రోడ్‌స్టర్ 400’ (Roadster 400) మోడల్స్ అత్యంత ప్రజాదరణ పొందాయి.
మోటోహాస్ వ్యాపార నెట్వర్క్..
KAW గ్రూప్‌నకు చెందిన ‘KAW వెలోస్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్’ కింద మోటోహాస్ పనిచేస్తోంది. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో తయారీ ప్లాంట్‌ను కలిగి ఉన్న ఈ సంస్థ, ఇప్పటికే బ్రిక్స్టన్ మోటార్‌సైకిల్స్ (Brixton Motorcycles), VLF బ్రాండ్లను భారతదేశంలో విక్రయిస్తోంది. ఇటల్జెట్ కలయికతో తమ గ్లోబల్ బ్రాండ్ల లైనప్ మరింత విస్తరించనుంది.
ధరలు, మోడళ్లపై స్పష్టత నవంబర్‌లో: భారతదేశానికి ఏ మోడళ్లను తీసుకొస్తున్నారు, వాటి ధర ఎంత ఉండబోతోంది, బుకింగ్‌లు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి అనే పూర్తి వివరాలను నవంబర్ మొదటి వారంలో జరగబోయే EICMA 2026 వేదికగానే అధికారికంగా వెల్లడించనున్నారు.
ప్రీమియం మరియు స్పోర్ట్స్ టూ-వీలర్ ప్రియులను లక్ష్యంగా చేసుకుని ఇటల్జెట్ తన ఉత్పత్తులను భారత మార్కెట్‌కు అనుగుణంగా ప్రవేశపెట్టే యోచనలో ఉంది.








