Air India Saudi Arabia Flights Cancelled October 20 పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) ప్రాంతంలో భద్రతా పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో భారతీయ విమానయాన సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. సౌదీ అరేబియాలోని ప్రధాన నగరాలకు సర్వీసుల రద్దును ఈ నెల అక్టోబర్ 20 వరకు పొడిగిస్తున్నట్లు ఎయిర్ ఇండియా (Air India), ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ (Air India Express) శుక్రవారం అధికారికంగా ప్రకటించాయి. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (X) వేదికగా ఎయిర్లైన్స్ సంస్థలు ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేశాయి. రియాద్ (Riyadh), జెల్దా (Jeddah), దమ్మమ్ (Dammam) తదితర నగరాలకు వెళ్లే మరియు అక్కడ నుంచి వచ్చే విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశాయి.
అక్టోబర్ 20 వరకు రద్దు..
సౌదీ అరేబియాలోని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రియాద్, దమ్మమ్, జెల్దాలకు రాకపోకలు సాగించే అన్ని ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలను అక్టోబర్ 20 వరకు రద్దు చేసినట్లు సంస్థలు వెల్లడించాయి.
పూర్తి రీఫండ్ / ఉచిత రీషెడ్యూల్..
విమానాల రద్దు వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులకు పూర్తి రిఫండ్ (Full Refund) పొందే సదుపాయాన్ని లేదా ఉచితంగా ప్రయాణ తేదీలను మార్చుకునే (Complimentary Rescheduling) అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ఎయిర్లైన్స్ ప్రతినిధులు తెలిపారు. తమ ప్రయాణికులు, విమాన సిబ్బంది సురక్షతే తమకు అత్యంత ప్రాధాన్యమని, అక్కడ పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నామని ఎయిర్ ఇండియా వెల్లడించింది.
ఇతర విమానయాన సంస్థల నిర్ణయాలు..
ఇండిగో (IndiGo): రియాద్, జెల్దా, దమ్మమ్, మదీనా నగరాలకు విమానాల రద్దును అక్టోబర్ 24 వరకు పొడిగించింది.
ఆకాసా ఎయిర్ (Akasa Air): రియాద్ సర్వీసులను అక్టోబర్ 24 వరకు, జెల్దా సర్వీసులను అక్టోబర్ 21 వరకు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.







