Friday 25th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘హౌస్ హస్బెండ్’ కాన్సెప్ట్ నార్మల్ కావాలి: మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు!

‘హౌస్ హస్బెండ్’ కాన్సెప్ట్ నార్మల్ కావాలి: మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు!

Madras High Court On House Husband దాంపత్య జీవితం, గృహ బాధ్యతలపై మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. “సమాజంలో భార్య గృహిణి (Housewife)గా ఉన్నట్లే.. భర్త కూడా ఇంటికే పరిమితమై బాధ్యతలు చూసుకునే భర్త (House Husband) కావచ్చు. ఇది సమాజంలో ఒక కొత్త సాధారణ అంశంగా (New Normal) మారాలి” అని వ్యాఖ్యానించింది.

గృహ బాధ్యతలను సమానంగా పంచుకోవడం వల్ల వివాహ బంధాలు, కుటుంబ వ్యవస్థ మరింత బలోపేతం అవుతాయని ధర్మాసనం అభిప్రాయపడింది. డాక్టర్ దంపతుల మధ్య నడుస్తున్న వైవాహిక వివాదాన్ని పరిష్కరిస్తూ జస్టిస్ జి.ఆర్. స్వామినాథన్, జస్టిస్ ఎమ్.డి. సుమతిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.

హోమ్‌మేకర్ (Homemaker) జెండర్ న్యూట్రల్..

‘హోమ్‌మేకర్’ (ఇంటిని చక్కదిద్దే వ్యక్తి) అనేది లింగభేదం లేని పదమని, గృహిణి చేసే పనికి ఎంతో ఆర్థిక విలువ ఉందని సుప్రీంకోర్టు కూడా గతంలో స్పష్టం చేసిందని హైకోర్టు గుర్తుచేసింది. నేటి కాలంలో మహిళలు కెరీర్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని, ఐటీ సహా పలు రంగాల్లో వివాహాన్ని తమ కెరీర్‌కు అడ్డంకిగా భావించి పెళ్లిళ్లకు దూరంగా ఉంటున్నారని కోర్టు పేర్కొంది. భర్తలు కూడా గృహ బాధ్యతల్లో భాగస్వామ్యులై ఇంటిని చూసుకుంటే (House-Husband) ఈ పరిస్థితి మారే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

పుదుచ్చేరిలో కలిసి పనిచేస్తున్న దంపతులు 2011లో వివాహం చేసుకున్నారు. ఉన్నత చదువుల కోసం భర్త కార్డియాలజీ చదువుతుండగా, భార్య పిల్లల సంరక్షణ కోసం పుట్టింటి వద్దే ఉంది. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించగా.. ఇరుపక్షాల పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. దీనిపై హైకోర్టులో వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు.

పరస్పర అంగీకారంతో విడాకులు..

విచారణ సందర్భంగా భర్త రూ.2.5 కోట్లు ఇచ్చేందుకు, భార్య అందుకు అంగీకరించడంతో పరస్పర అంగీకారంతో విడాకులు మంజూరు చేశారు. ఇందులో రూ.1.5 కోట్లు భార్య ఖాతాలో, ఇద్దరు పిల్లల పేరిట చెరో రూ.50 లక్షలు డిపాజిట్ చేయాలని ఆదేశిస్తూ కేసును ముగించారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions