SBI Waives ATM Charges యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) పిలుపునిచ్చిన మూడు రోజుల దేశవ్యాప్త సమ్మె నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన వినియోగదారులకు ఊరటనిచ్చే నిర్ణయాన్ని ప్రకటించింది. సెప్టెంబర్ 28 నుండి 30 వరకు బ్యాంకు సమ్మె జరిగే మూడు రోజుల పాటు అన్ని బ్యాంకుల ఏటీఎమ్‌లలో ట్రాన్సాక్షన్ ఛార్జీలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.
సమ్మె సమయంలో బ్రాంచీలు మూతపడినా నగదు సమస్యలు రాకుండా ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు గురువారం ‘X’ (ట్విట్టర్) వేదికగా ఎస్బీఐ తెలిపింది.
ఏటీఎం ఛార్జీల మినహాయింపు..
సమ్మె కాలంలో (సెప్టెంబర్ 28-30) ఉచిత పరిమితి దాటినప్పటికీ, దేశంలోని ఏ బ్యాంకు ఏటీఎం నుండి డబ్బులు విత్‌డ్రా చేసినా ఎస్బీఐ ఎటువంటి సేవా రుసుములు వసూలు చేయదు. సమ్మెకు ముందు వచ్చే ఆదివారం రోజున ఎస్బీఐ బ్రాంచీలు తెరిచే ఉంటాయని బ్యాంకు స్పష్టం చేసింది.
అత్యవసర లావాదేవీలను ముందే పూర్తి చేసుకోవాలని, సమ్మె సమయంలో యోనో (YONO), నెట్ బ్యాంకింగ్, యూపీఐ మరియు ఇతర డిజిటల్ ఛానళ్లను వినియోగించుకోవాలని ఖాతాదారులకు సూచించింది.
అక్టోబర్ 1 నుండి కొత్త నిబంధనలు..
అక్టోబర్ 1 నుండి శాలరీ ఖాతాదారులకు ఇతర బ్యాంకుల ఏటీఎమ్‌లలో నెలకు ఉండే ఉచిత పరిమితిని 10 నుంచి 5కి తగ్గించనున్నట్లు ఎస్బీఐ వెల్లడించింది. పరిమితి దాటితే నగదు ఉపసంహరణపై రూ.23 + GST వర్తిస్తుంది.









