Malkajgiri CP Sumathi | పోలీస్ ఆఫీసర్ కావాలన్న ఓ దివ్యాంగ యువకుడి చిరకాల కోరికను మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి నెరవేర్చారు. మానవీయతను ప్రతిబింబించే ఈ సంఘటన పలువురిని భావోద్వేగానికి గురిచేస్తోంది.
మల్కాజిగిరి కమిషనరేట్ కార్యాలయానికి వచ్చిన దివ్యాంగ యువకుడు రాహుల్‌ను సీపీ సుమతి ఆప్యాయంగా కలుసుకున్నారు. అనంతరం తన అధికారిక కుర్చీలో రాహుల్‌ను కూర్చోబెట్టి, పోలీస్ క్యాప్‌ను అతనికి ధరింపజేసి గౌరవించారు. కొద్దిసేపు పోలీస్ అధికారిగా అనుభూతి పొందే అవకాశం కల్పించారు.
ఈ ప్రత్యేక క్షణంతో రాహుల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన చిరకాల స్వప్నాన్ని నిజం చేసిన సీపీ సుమతికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, సిబ్బంది కూడా ఈ మానవీయ చర్యను అభినందించారు.
దివ్యాంగుల ఆశయాలకు ప్రోత్సాహం అందిస్తూ, వారి కలలకు విలువ ఇవ్వాలనే సందేశాన్ని ఈ కార్యక్రమం అందించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, సీపీ సుమతిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.











