- 5 వేల మంది సిబ్బందితో అర్ధరాత్రి సాగిన సోదాలు
- క్షేత్రస్థాయిలో స్వయంగా పర్యవేక్షించిన నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్
- నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
Operation Kavach Midnight Searches In Hotels And Lodges | హైదరాబాద్ నగర అంతర్గత భద్రతను పటిష్టం చేయడంతో పాటు, అసాంఘిక శక్తుల కదలికలను ముందస్తుగా నిరోధించే లక్ష్యంతో శుక్రవారం రాత్రి ‘ఆపరేషన్ కవచ్’ తనిఖీలను సిటీ పోలీసులు నిర్వహించారు.
శాంతి భద్రతల పరిరరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ చేపట్టిన ఈ సోదాలలో సుమారు 5,000 మంది పోలీస్ సిబ్బంది పాల్గొని, మొత్తం 562 హోటళ్లు, లాడ్జీలలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.
హోటల్ రిజిస్టర్లను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు, బస చేయడానికి వచ్చిన విజిటర్ల గుర్తింపు కార్డులను తనిఖీ చేస్తున్నారా? లేదా అనే అంశాలను నిశితంగా పరిశీలించారు. అర్థరాత్రి 11 గంటల నుంచి ఒంటిగంట వరకు ఈ సోదాలు కొనసాగాయి.
ఈ ఆపరేషన్‌లో భాగంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు స్వయంగా క్షేత్రస్థాయి పరిశీలనలో పాల్గొన్నారు. నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని, అమీర్‌పేటలోని పలు లాడ్జీలను ఆయన స్వయంగా సందర్శించారు.
గదుల కేటాయింపు ప్రక్రియ, విజిటర్ల వివరాల నమోదు విధానాన్ని పరిశీలించారు. లాడ్జీలలో బస చేసిన పలువురు విజిటర్లతో నేరుగా మాట్లాడి, వారు ఏ ప్రాంతం నుండి వచ్చారు, నగర సందర్శనకు గల కారణాలు, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ ముమ్మర తనిఖీలలో భాగంగా కమిషనరేట్ పరిధిలోని 7 జోన్లలో మొత్తం 562 హోటళ్లు, లాడ్జీల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. జోన్ల వారీగా తనిఖీలు జరిగిన లాడ్జీలు, హోటళ్ల వివరాలు చూస్తే… అత్యధికంగా ఖైరతాబాద్‌లో 119, శంషాబాద్‌లో 92, జూబ్లీహిల్స్, గోల్కొండలలో 86 చొప్పున, సికింద్రాబాద్‌లో 82, రాజేంద్రనగర్‌లో 53, చార్మినార్ జోన్‌లో 44 చోట్ల ఈ ఆపరేషన్ కొనసాగింది. ఈ సోదాలలో లా అండ్ ఆర్డర్ పోలీసులు సమన్వయంతో వ్యవహరించి, హోటళ్ల రికార్డులను, గదులను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ తనిఖీల నేపథ్యంలో హోటళ్లు, లాడ్జీల నిర్వాహకులు విధిగా నిబంధనలు పాటించాలని నగర సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు స్పష్టం చేశారు.
అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడమే ఈ తనిఖీల ముఖ్య ఉద్దేశమని తెలుపుతూ, లాడ్జీకి వచ్చే ప్రతి ఒక్కరి నుండి గుర్తింపు కార్డుల ఒరిజనల్ ప్రతిని పరిశీలించి, దాని స్పష్టమైన నకలును సేకరించాలని ఆదేశించారు. రిజిస్టర్లలో విజిటర్ల పూర్తి సమాచారం, ఫోన్ నంబర్లు, చెక్ ఇన్ , చెక్ అవుట్ సమయాలను కచ్చితంగా నమోదు చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అసంపూర్ణ లేదా తప్పుడు సమాచారంతో గదులను కేటాయించరాదన్నారు.
మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ గదులను ఇవ్వొద్దని, గుర్తింపు కార్డుల్లో ఉన్న వయసును దృవీకరించుకోవాలన్నారు. పెరుగుతున్న సాంకేతికతకు అనుగుణంగా త్వరలోనే నూతన డిజిటల్ విజిటర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టే దిశగా సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు.
భద్రతా నిఘాను బలోపేతం చేయడానికి హోటల్ పరిసరాలలో, ముఖ్యంగా ఎంట్రీ, ఎగ్జిట్, రిసెప్షన్ ఏరియాలు స్పష్టంగా కనిపించేలా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, ప్రతి ఒక్క కెమెరా నిరంతరాయంగా పనిచేసేలా చూసుకోవాలని సూచించారు.
ఎవరైనా అనుమానాస్పదంగా ప్రవర్తించినా లేదా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే సూచనలు కనిపించినా వెంటనే డయల్ 100కి గానీ, స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. నిబంధనలను బేఖాతరు చేసే నిర్వాహకులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి పోలీసులకు సహకరించాలని పిలుపునిచ్చారు.
ఈ తనిఖీల్లో అదనపు సీపీ క్రైమ్స్శ్రీ నివాసులు, ఐపీఎస్, అదనపు సీపీ లా అండ్ ఆర్డర్ తఫ్షీర్ ఇక్బాల్, ఐపీఎస్, జాయింట్ సీపీ ట్రాఫిక్ జోయల్ డేవిస్, ఐపీఎస్, జాయింట్ సీపీ లా అండ్ ఆర్డర్ నార్త్ జోన్ శ్వేత, ఐపీఎస్, డీసీపీ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ వెంకటేశ్వర్లు, ఐపీఎస్, డీసీపీ క్రైమ్స్ చైతన్య కుమార్, ఐపీఎస్ తో పాటు అన్ని జోన్ల డీసీపీలు కిరణ్ ఖరే, ఐపీఎస్, శిల్పవల్లి, ఐపీఎస్, శ్రీనివాస్, ఐపీఎస్, చంద్ర మోహన్, రమణా రెడ్డి, రాజేష్, డీసీపీ సైబర్ క్రైమ్స్ అరవింద్ బాబు, డీసీపీ విమెన్ సేఫ్టీ వింగ్ లావణ్య నాయక్ జాదవ్, అదనపు డీసీపీలు, ఏసీపీలు, తదితరులు పాల్గొన్నారు.








