BRS Chief KCR Telangana Formation Day Message | జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ అధినేత, ఉద్యమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) తెలంగాణ ప్రజలకు, పార్టీ శ్రేణులకు అత్యంత భావోద్వేగ భరితమైన సందేశాన్ని ఇచ్చారు.
దశాబ్దాల అణిచివేతపై సాగిన పోరాటాన్ని గుర్తు చేస్తూ.. తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం ‘కేసీఆర్ దళం’ ఎల్లప్పుడూ ప్రజల గొంతుకగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ సాధన వెనుక ఉన్న భావోద్వేగాలను, ఉద్యమ ప్రస్థానాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా గట్టిగా పునరుద్ఘాటించారు.
“అసమానతలు, అవమానాలు, అణిచివేతల నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిన రోజు జూన్ 2. అమరవీరుల త్యాగానికి, తెలంగాణలోని సబ్బండ వర్గాల ఆత్మగౌరవ పోరాటానికి ఫలితం దక్కి… 60 ఏళ్ల కల సాకారమైన శుభదినం ఇది” అని కేసీఆర్ పేర్కొన్నారు.
‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అని నినదించి, తన ప్రాణాన్ని పణంగా పెట్టి, స్వరాష్ట్ర ఉద్యమాన్ని విజయ తీరాలకు చేర్చిన చారిత్రక సందర్భాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ నాయకత్వంలోనే పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానానికి నాంది పడిందని చెప్పారు.
ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ శ్రేణులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమ పోరులో కానీ, తొమ్మిదిన్నరేళ్ల తమ ప్రభుత్వ ప్రగతి హోరులో కానీ కేసీఆర్ దళమంతా కేవలం తెలంగాణ అభ్యున్నతే ధ్యేయంగా పనిచేసిందని స్పష్టం చేశారు.
తెలంగాణ అస్తిత్వ పరిరక్షణలో, ప్రజల సమస్యలను లేవనెత్తడంలో కేసీఆర్ దళం ఎప్పుడూ ప్రజల పక్షానే నిలబడుతుందని, మున్ముందూ పనిచేస్తుందని భరోసా ఇచ్చారు. ఈ ఆవిర్భావ దినోత్సవ వేళ ప్రజలకు సేవ చేయడానికి మరొక్కసారి పునరంకితమవుదామని పిలుపునిచ్చారు.
ఇదే సమయంలో.. “విద్రోహ శక్తుల నుండి మన తెలంగాణను కాపాడుకుందాం” అంటూ కేసీఆర్ ఇచ్చిన నినాదం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
చివరగా తెలంగాణ అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ. జై తెలంగాణ’ అంటూ తన సందేశాన్ని ముగించారు.









