Annamalai Praises Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు పొరుగు రాష్ట్రాల నేతలను కూడా ఆకర్షిస్తున్నాయి.
తాజాగా తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై, పవన్ కళ్యాణ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రజల అవసరాలను గుర్తించి తక్షణమే స్పందించే ‘పీపుల్ ఫస్ట్ గవర్నెన్స్’కు పవన్ కళ్యాణ్ ఒక నిదర్శనమని ఆయన కొనియాడారు.
నెరవేరిన భక్తుల దశాబ్దాల కల..
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి నుండి తమిళనాడులోని సుప్రసిద్ధ క్షేత్రం పళని వరకు నేరుగా బస్సు సౌకర్యం కల్పించాలని భక్తులు చాలా కాలంగా కోరుతున్నారు.
ఈ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన పవన్ కళ్యాణ్, రవాణా శాఖతో సమీక్ష నిర్వహించి తక్షణమే చర్యలు తీసుకున్నారు. దీని ఫలితంగా APSRTC ద్వారా తిరుపతి-పళని మధ్య రోజుకు రెండు ప్రత్యేక బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి.
ఆధ్యాత్మిక యాత్ర ఇక సులభతరం..
ఈ నిర్ణయంపై అన్నామలై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. “పవనన్నా మీ నిర్ణయం ప్రశంసనీయం” అంటూ హర్షం వ్యక్తం చేశారు.
భక్తుల ఆధ్యాత్మిక యాత్ర సౌలభ్యం కోసం, క్షేత్రస్థాయి సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించడంలో పవన్ చూపిన చొరవ అద్భుతమని పేర్కొన్నారు.
ఈ బస్సు సర్వీసుల వల్ల రెండు రాష్ట్రాల మధ్య ఆధ్యాత్మిక సంబంధాలు మరింత బలపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జనసైనికులతో పాటు సాధారణ భక్తులు కూడా “థాంక్యూ పవనన్న” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.










