CM Vijay respects Premalatha | రాజకీయాల్లో పదవులు వస్తాయి, పోతాయి.. కానీ సంస్కారం మాత్రం శాశ్వతంగా ఉండిపోతుంది. తమిళనాడు అసెంబ్లీలో నేడు ముఖ్యమంత్రి విజయ్ సరిగ్గా ఇదే నిరూపించారు.
విరుధాచలం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన DMDK అధినేత్రి దివంగత నటుడు విజయకాంత్ సతీమణి ప్రేమలత విజయ్‌కాంత్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో సభలో ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది.
ప్రేమలత ఎమ్మెల్యేగా ప్రమాణం పూర్తి చేసిన వెంటనే, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న విజయ్ తన సీటు నుండి లేచి నిలబడి, ఆమెకు రెండు చేతులెత్తి వినమ్రంగా నమస్కరించారు. ఇది చూసి సభలోని వారంతా ఆశ్చర్యపోయారు.
ప్రేమలత కూడా అంతే ఆత్మీయంగా చిరునవ్వుతో విజయ్‌కు ప్రతి నమస్కారం చేశారు. కేవలం రాజకీయ ప్రత్యర్థులుగా కాకుండా, ఒక కుటుంబ సభ్యుడిలా విజయ్ వ్యవహరించిన తీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఆ పాత అనుబంధమే కారణమా..
విజయ్ ఈ స్థాయిలో గౌరవం ఇవ్వడం వెనుక దివంగత నటుడు, DMDK వ్యవస్థాపకుడు విజయ్‌కాంత్ (కెప్టెన్) తో ఉన్న పాత అనుబంధమే కారణమని అందరికీ తెలుసు.
విజయ్ కెరీర్ ప్రారంభంలో కష్టాల్లో ఉన్నప్పుడు, విజయ్‌కాంత్ తన సినిమా ‘సెంధూరపాండి’ లో నటించి విజయ్‌కు పెద్ద బ్రేక్ ఇచ్చారు.
విజయ్ తండ్రి ఎస్.ఎ. చంద్రశేఖర్, విజయ్‌కాంత్ మధ్య దశాబ్దాల స్నేహం ఉంది. కెప్టెన్ మరణించినప్పుడు విజయ్ పరుగెత్తుకుంటూ వెళ్లి కన్నీరు పెట్టుకున్న దృశ్యాలు అభిమానుల కళ్లముందే ఉన్నాయి.








