Wednesday 14th October 2026
12:07:03 PM
Home > క్రైమ్ > మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్ కేస్: భార్య ముస్కాన్, ప్రియుడికి ఉరిశిక్ష!

మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్ కేస్: భార్య ముస్కాన్, ప్రియుడికి ఉరిశిక్ష!

Meerut Blue Drum Murder Case Death Sentence దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన మర్చంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ రాజ్‌పుత్ హత్య కేసు (‘బ్లూ డ్రమ్ మర్డర్ కేసు’) లో యూపీలోని మీరట్ జిల్లా మరియు సెషన్స్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. సౌరభ్‌ను అత్యంత దారుణంగా హత్య చేసిన అతని భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాలకు జిల్లా మరియు సెషన్స్ న్యాయమూర్తి అరవింద్ కుమార్ మిశ్రా బుధవారం మరణశిక్ష (ఉరిశిక్ష) విధిస్తూ తీర్పు చెప్పారు.

నేరం వెలుగుచూసిన దాదాపు రెండేళ్ల తర్వాత కోర్టు ఈ చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి మహాభారతాన్ని ప్రస్తావిస్తూ.. “తగిన శిక్ష విధించడం కూడా ధర్మంలో ఒక భాగమే” అని వ్యాఖ్యానించారు.

హత్య వెనుక దారుణ కోణం?

మార్చి 3, 2025న మర్చంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ రాజ్‌పుత్‌ను అతని భార్య ముస్కాన్, ఆమె ప్రియుడు సాహిల్ కలిసి పథకం ప్రకారం హత్య చేశారు. హత్య అనంతరం సౌరభ్ మృతదేహాన్ని ముక్కలుగా నరికి, సిమెంట్‌తో నింపిన ఒక బ్లూ కలర్ ప్లాస్టిక్ డ్రమ్‌లో పెట్టి దాచేశారు. పోలీసుల దర్యాప్తులో ఈ దారుణం బయటపడటంతో ఇద్దరినీ అరెస్టు చేసి, సిమెంట్ డ్రమ్ నుంచి శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిందితులిద్దరినీ కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా సౌరభ్ తల్లి రేణు రాజ్‌పుత్, అతని సోదరుడు కోర్టు హాలులోనే ఉన్నారు.

‘కూతురికైనా మరణశిక్ష విధించాల్సిందే’

కోర్టు తీర్పునకు ముందే ముస్కాన్ సొంత తల్లిదండ్రులు కోర్టుకు ఒక లిఖితపూర్వక ప్రకటన సమర్పించారు. తమ కుమార్తెకు మరణశిక్ష విధించినా తాము వ్యతిరేకించబోమని వారు స్పష్టం చేయడం గమనార్హం. తీర్పు వెలువడిన అనంతరం సౌరభ్ తల్లి రేణు రాజ్‌పుత్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. “కలిసి ఉండటం ఇష్టం లేకపోతే విడిపోండి.. కానీ ఒకరి పిల్లలను ఇలా ప్రాణాలు తీయకండి. ఇలాంటి ఘోరానికి పాల్పడే ఎవరికైనా ఇలాంటి మరణశిక్షే పడాలి” అని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.

తీర్పు ముందు భయాందోళనలో నిందితులు..

మంగళవారం రాత్రి నుంచే ముస్కాన్, సాహిల్‌లు తీవ్ర భయాందోళనతో నిద్రపోలేదని, ఆహారం కూడా సరిగ్గా తీసుకోలేదని జైలు సీనియర్ సూపరింటెండెంట్ వీరేశ్ రాజ్ శర్మ తెలిపారు. శిక్ష ఖరారైనందున జైలు నిబంధనల ప్రకారం వారిద్దరూ ఇకపై ఖైదీల యూనిఫాం ధరించాల్సి ఉంటుందని, నిబంధనల ప్రకారం ఇద్దరూ కలుసుకోవడానికి వీల్లేదని అధికారులు స్పష్టం చేశారు.

You may also like
కాన్పూర్‌లో వ్యాపారి దారుణ హత్య.. కోడలే సూత్రధారి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions