Chiranjeevi Seed Ganesha Challenge ప్రకృతి సంరక్షణ, పచ్చదనం పెంపు కోసం ఈసారి ప్రతీ ఒక్కరూ ‘సీడ్ గణేశుడిని’ (విత్తన వినాయకుడు) పూజించాలని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు ఏటా వినూత్నంగా శ్రీకారం చుడుతున్న ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ రూపొందించిన సీడ్ గణేశా ప్రతిమలను ఆదివారం చిరంజీవి తన స్వగృహంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపకర్త, మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్ పాల్గొన్నారు.
దేవుడే వృక్షమైతే.. చిరంజీవి సందేశం..
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల జలాశయాలు కలుషితమవుతున్నాయని, సీడ్ గణేశుడిని పూజించి ఇంట్లోనే కుండీలో నిమజ్జనం చేయడం వల్ల దేవుడే మొక్కగా ఎదిగి మనల్ని ఆశీర్వదిస్తాడని చిరంజీవి తెలిపారు. విత్తన వినాయకుడిని ఆరాధించడం వల్ల ఆధ్యాత్మిక పుణ్యంతో పాటు ప్రకృతిని కాపాడే బాధ్యత కూడా నెరవేరుతుందని పేర్కొన్నారు.
సంతోష్‌కుమార్ శ్రమకు అభినందనలు..
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా ఇప్పటికే 20 కోట్ల మొక్కలు నాటేలా లక్షలాది మందిని ప్రోత్సహిస్తున్న సంతోష్‌కుమార్‌ను చిరంజీవి కొనియాడారు.
దేవుడే వృక్షమయ్యే వినూత్న ప్రక్రియ..
మట్టి, కోకోపీట్, కొబ్బరి పొడితో చేసే ఈ విగ్రహాల కడుపులో వేప, చింత వంటి దేశీయ వృక్షాల విత్తనాలను ఉంచుతారు. నవరాత్రుల పూజల అనంతరం కుండీలో నిమజ్జనం చేసి నీళ్లు పోస్తే.. విగ్రహం కరిగిపోయి విత్తనం మొలకెత్తి పచ్చని చెట్టుగా మారుతుంది.
మాజీ సీఎం కేసీఆర్ మానస పుత్రికగా నిలిచిన ‘హరితహారం’ స్ఫూర్తితో 2018లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభమై ఇప్పటివరకు 19.6 కోట్ల చెట్లను నాటడం విశేషం.
2020లో కరోనా సమయంలో ప్రారంభమైన ఈ సీడ్ గణేశా పంపిణీ.. 2025లో స్వర్ణగిరి ఆలయంలో నారా రోహిత్ సమక్షంలో 5 లక్షల విగ్రహాల పంపిణీ దాకా విస్తరించి, 2026 సీజన్ నాటికి చిరంజీవి చేతుల మీదుగా మరింత ప్రజాదరణ పొందుతోంది.











