Monday 14th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > అమెరికా మరో షాక్.. OPT వీసాపై $1 లక్ష ఫీజు ప్రతిపాదన!

అమెరికా మరో షాక్.. OPT వీసాపై $1 లక్ష ఫీజు ప్రతిపాదన!

US Plans 100k Dollar Fee On OPT Visas | అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించే అంతర్జాతీయ విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం మరో కీలక ప్రతిపాదనను పరిశీలిస్తోంది.

అమెరికన్ విశ్వవిద్యాలయాల నుంచి పట్టభద్రులైన తర్వాత ఉద్యోగం చేసేందుకు ఉపయోగించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) వీసాపై 1 లక్ష డాలర్ల ఫీజు విధించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ వెల్లడించింది.

హెచ్-1బీ వీసాలపై 1 లక్ష డాలర్ల ఫీజు విధించాలన్న ప్రతిపాదనను అమెరికా కోర్టు కొట్టివేసిన తర్వాత ప్రభుత్వం ఈ ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టినట్లు కథనం పేర్కొంది.

OPT కార్యక్రమం ఎఫ్-1 విద్యార్థి వీసాకు పొడిగింపుగా ఉంటుంది. దీని ద్వారా విదేశీ విద్యార్థులు తమ చదువులకు సంబంధించిన రంగాల్లో ఒకటి నుంచి మూడు సంవత్సరాల వరకు అమెరికాలో పనిచేయవచ్చు.

2024లో అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం, సుమారు 4.19 లక్షల మంది విదేశీయులు OPT కార్యక్రమం కింద ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ ప్రతిపాదనపై హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం స్పందించింది.

అధికారిక ప్రకటన వెలువడే వరకు ఎలాంటి ప్రతిపాదననూ తుది నిర్ణయంగా భావించవద్దని తెలిపింది. వలస వ్యవస్థ సమగ్రతను కాపాడేందుకు వివిధ మార్గాలను నిరంతరం పరిశీలిస్తున్నామని పేర్కొంది.

అదే సమయంలో, అమెరికా వెలుపల గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి కూడా 1 లక్ష డాలర్ల బాండ్ విధించే అవకాశాన్ని అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

అమెరికాలో చదవాలనుకునే విదేశీ విద్యార్థులకు OPT కార్యక్రమం ప్రధాన ఆకర్షణగా ఉంది. ఈ కార్యక్రమం లేకుంటే పట్టభద్రులైన వెంటనే చాలా మంది విద్యార్థులు అమెరికాను విడిచి వెళ్లాల్సి వస్తుంది.

కొత్త ప్రతిపాదన అమలైతే భారతీయ విద్యార్థులతో పాటు ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది అంతర్జాతీయ విద్యార్థులపై ప్రభావం పడే అవకాశం ఉంది.

You may also like
h1b visa process
హెచ్-1బీ వీసాదారులకు ట్రంప్ ప్రభుత్వం బిగ్ షాక్!
student visa
అమెరికా వీసా దరఖాస్తుదారులకు బిగ్ షాక్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions