Pawan Kalyan Welcomes Kunki Elephants | ఆంధ్ర ప్రదేశ్ లోని విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అడవి ఏనుగుల గుంపు పంట పొలాలను నాశనం చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఆ ఏనుగులను కట్టడి చేసేందుకు అటవీ శాఖ మరో కీలక చర్య చేపట్టింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు కుంకీ ఏనుగులను పంపిస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు.
పలమనేరు నుంచి పార్వతీపురం మన్యం జిల్లాకు వెళ్తున్న ‘జయంత్’, ‘అభిమన్యు’ అనే రెండు కుంకీ ఏనుగులకు మంగళగిరి క్యాంపు కార్యాలయం వద్ద ఆయన పూలమాలలు వేసి ప్రత్యేకంగా స్వాగతం పలికారు.
అనంతరం వాటికి చెరుకు గెడలను ఆహారంగా అందించి వీడ్కోలు పలికారు.ఈ రెండు కుంకీ ఏనుగులను మొదట పార్వతీపురం మన్యం జిల్లాలోని గుచ్చిమి క్యాంపునకు తరలిస్తారు.
అక్కడి నుంచి అడవి ఏనుగులు తిరుగుతున్న ప్రాంతాలకు తీసుకెళ్లి వాటిని నియంత్రించేందుకు అటవీశాఖ అధికారులు తగిన చర్యలు చేపడతారు.
జయంత్, అభిమన్యులకు గతంలో కూడా ఇలాంటి క్లిష్టమైన ఆపరేషన్లు నిర్వహించిన అనుభవం ఉండటంతో అధికారులు ముందుగా వీటిని రంగంలోకి దించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అధికారులకు పలు సూచనలు చేశారు.
ఒడిశా నుంచి అడవి ఏనుగులు వచ్చి పంటలను ధ్వంసం చేస్తున్నందున, ఆ ప్రభుత్వంతో మాట్లాడి ఏనుగుల మళ్లింపుపై చర్చలు జరపాలని స్పష్టం చేశారు. ఒడిశా నుంచి కూడా కొన్ని కుంకీ ఏనుగులను రప్పించి ఏనుగుల సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు.
ఆ లోగా మన వద్ద ఉన్న కుంకీలతోనే అడవి ఏనుగులను వీలైనంత త్వరగా తిరిగి అడవుల్లోకి పంపించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.











