- సైన్యం మోహరింపు హెచ్చరికలతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం!
Telangana High Court HYDRAA Contempt Case న్యాయస్థాన ఉత్తర్వులను పదేపదే ఉల్లంఘిస్తున్నారన్న ఆరోపణలపై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జుకంటి అనిల్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం, హైడ్రా (HYDRAA) తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. కోర్టు ఉత్తర్వులు అమలు కావడానికి ఏకంగా సైనిక సిబ్బందిని (Army Personnel) మోహరించాలని రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
అయితే, అడ్వకేట్ జనరల్ గట్టి హామీ ఇవ్వడంతో కోర్టు ఆ ఆదేశాల అమలును తాత్కాలికంగా వాయిదా వేసింది.
మూడోసారి కోర్టు ధిక్కరణ పిటిషన్..
మెడ్చల్-మల్కాజిగిరి జిల్లా, లోత్‌కుంట గ్రామంలోని సర్వే నెం.1, 2 పరిధిలోని 40.00 ఎకరాల భూమిలో హైడ్రా అధికారులు అక్రమంగా చొరబడుతున్నారంటూ ‘మెస్సర్స్ శాంత శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్’ సంస్థ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది.
జూలై 20న జరిగిన విచారణలో హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్ స్వయంగా హాజరై, సదరు భూమిలో జోక్యం చేసుకోమని కోర్టుకు హామీ ఇచ్చారు.
కానీ జూలై 21న పిటిషనర్ పునరుద్ధరణ పనులు ప్రారంభించగానే, హైడ్రా అధికారులు పోలీసులతో కలిసి వచ్చి పనులను అడ్డుకున్నారని పిటిషనర్ న్యాయవాది ఎం. హరీష్ కుమార్ ఫోటో ఆధారాలను కోర్టుకు సమర్పించారు.
“రాష్ట్ర యంత్రాంగంపై నమ్మకం పోయింది”
కోర్టు ఆదేశాలను పదేపదే ధిక్కరిస్తుంటే మౌన ప్రేక్షకునిగా ఉండలేమని జస్టిస్ అనిల్ కుమార్ స్పష్టం చేశారు. “సాధారణంగా పౌర వివాదాల్లో సైన్యం జోక్యం చేసుకోదు.
కానీ న్యాయ ఉత్తర్వులను అమలు చేయడంలో రాష్ట్ర యంత్రాంగంపై విశ్వాసం కోల్పోవడం వల్లే కోర్టు ఈ అసాధారణ నిర్ణయం తీసుకోవాల్సి వస్తోంది.” అని జస్టిస్ జుకంటి అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు.
వివాదాస్పద భూమిని భద్రపరచడానికి బైసన్ డివిజన్ అత్యున్నత బ్రిగేడియర్‌ను సంప్రదించి సైన్యాన్ని మోహరించాలని, ఈ ప్రతీని కేంద్ర ప్రభుత్వానికి పంపాలని రిజిస్ట్రీని ఆదేశించారు.
అడ్వకేట్ జనరల్ హామీ ..
హైకోర్టు తీవ్ర నిర్ణయం తీసుకోవడంతో అడ్వకేట్ జనరల్ ఎ. సుదర్శన్ రెడ్డి, అదనపు ఏజీ మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ వెంటనే కోర్టు ముందు హాజరయ్యారు. ఇకపై పిటిషనర్ భూమిలో ఎలాంటి జోక్యం ఉండదని, ప్రభుత్వం తరఫున చివరి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి, సైనిక మోహరింపు ఉత్తర్వుల అమలును వాయిదా వేశారు. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.









