Tuesday 21st July 2026
12:07:03 PM
Home > క్రీడలు > “హైదరాబాద్ అమూల్యమైన తార సిరాజ్”: డీజీపీ సి.వి. ఆనంద్!

“హైదరాబాద్ అమూల్యమైన తార సిరాజ్”: డీజీపీ సి.వి. ఆనంద్!

DSP Siraj Meets DGP CV Anand | భారత స్టార్ ఫాస్ట్ బౌలర్, తెలంగాణ పోలీస్ శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) అధికారిక ప్రోటోకాల్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) సి.వి. ఆనంద్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ భేటీ అనంతరం సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ (X) లో డీజీపీ సి.వి. ఆనంద్ స్పందిస్తూ.. సిరాజ్ టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడుతున్న రోజుల నుంచి భారతదేశపు అగ్రశ్రేణి బౌలర్‌గా ఎదిగిన ప్రయాణాన్ని ఎంతో ఆత్మీయంగా గుర్తుచేసుకున్నారు.

“టెన్నిస్ బాల్ నుండి రంజీల వరకు..”..

సిరాజ్ తొలినాళ్ల క్రికెట్ ప్రయాణాన్ని డీజీపీ సి.వి. ఆనంద్ గుర్తుచేసుకున్నారు. “హైదరాబాద్‌కు చెందిన భారత క్రికెటర్, తెలంగాణ పోలీస్‌లో డీఎస్పీ అయిన మహమ్మద్ సిరాజ్, ప్రోటోకాల్ ప్రకారం నన్ను కలిశారు.

అతను టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడుతున్నప్పటి నుండి నేను చూస్తున్నాను. 2013-14లో హైదరాబాద్ మాజీ క్రికెటర్, అప్పటి సెలెక్టర్ అబ్దుల్ అజీమ్ (Abdul Azeem) సిరాజ్ ప్రతిభను వచ్చి చూడమని నన్ను కోరారు.

అతడిని వెంటనే రెండు రోజుల లీగ్‌లలో, ఆ తర్వాత 2015లో మూడు రోజుల లీగ్‌లలో ఆడించాము. తన వేగం, కచ్చితత్వంతో రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసిన సిరాజ్, 2016-17 సీజన్‌లో ఏకంగా 41 వికెట్లు తీసి వెనుతిరిగి చూడలేదు.” అని సి.వి. ఆనంద్ రాసుకొచ్చారు.

కఠోర శ్రమకు ప్రత్యక్ష నిదర్శనం..

అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలోనూ (Test, ODI, T20I) భారత్‌కు ప్రాతినిధ్యం వహించే స్థాయికి సిరాజ్ చేరడం వెనుక ఉన్న కృషిని ఆనంద్ కొనియాడారు.

శ్రమకు ప్రతిఫలం: ప్రతిభ, క్రమశిక్షణ, కఠోర శ్రమ ఉంటే ఎంతటి కఠినమైన అడ్డంకులనైనా అధిగమించవచ్చని సిరాజ్ నిరూపించాడని వ్యాఖ్యానించారు.

తన వేగం మరియు తీవ్రతతో భారత బౌలింగ్ విభాగానికి సిరాజ్ అద్భుతమైన సహకారాన్ని అందిస్తున్నాడని, అతను హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక అమూల్యమైన తార అని ప్రశంసించారు.

డీఎస్పీగా బాధ్యతలు..

2024 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లో భారత్ చారిత్రాత్మక విజయం సాధించిన అనంతరం, తెలంగాణ ప్రభుత్వం సిరాజ్‌కు గ్రూప్-1 డీఎస్పీ ఉద్యోగాన్ని కేటాయించగా, ఆయన 2024 అక్టోబర్ 11న అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions