Wednesday 9th September 2026
12:07:03 PM
Home > తాజా > “మా జీవితాలను సంతోషంతో నింపావ్!”.. సితారపై నమ్రత ఎమోషనల్ పోస్ట్!

“మా జీవితాలను సంతోషంతో నింపావ్!”.. సితారపై నమ్రత ఎమోషనల్ పోస్ట్!

Namrata Shirodkar Emotional Post | సూపర్ స్టార్ మహేశ్ బాబు, నమ్రతా శిరోద్కర్ ల గారాల పట్టి ఘట్టమనేని సితార (Sitara Ghattamaneni) నేడు తన 14వ పుట్టినరోజును జరుపుకుంటోంది.

జులై 20న 14వ ఏట అడుగుపెట్టిన తన కుమార్తెకు నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వకమైన, ప్రేమతో నిండిన శుభాకాంక్షలు తెలియజేశారు.

సితార ఎదుగుదలను దగ్గరుండి చూడటమే తన జీవితంలో పొందిన అత్యంత పెద్ద ఆశీర్వాదమంటూ ఈ సందర్భంగా ఆమె భావోద్వేగానికి గురయ్యారు.

సితార నలుపు రంగు టాప్, ప్రింటెడ్ స్కర్ట్ ధరించి ఒక పచ్చని లాన్‌లో చెట్టు కింద ఎంతో స్టైలిష్‌గా కూర్చుని ఉన్న అందమైన ఫొటోను షేర్ చేస్తూ నమ్రత ఈ ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు.

“నా అందమైన పాపకు.. మా జీవితాలను ఇంత ప్రేమ, సంతోషంతో నింపినందుకు ధన్యవాదాలు. నువ్వు పెరగడం చూడటమే నా జీవితంలో అతి పెద్ద ఆశీర్వాదం. పుట్టినరోజు శుభాకాంక్షలు! లవ్ యూ సో మచ్” అని నమ్రతా శిరోద్కర్ పోస్ట్ చేశారు.

మహేశ్ బాబు, నమ్రత 2000 సంవత్సరంలో ‘వంశీ’ సినిమా షూటింగ్ సమయంలో తొలిసారి కలుసుకుని ప్రేమలో పడ్డారు. దాదాపు ఐదేళ్ల పాటు తమ ప్రేమను కొనసాగించిన ఈ జంట 2005 ఫిబ్రవరి 10న వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

నటనకు దూరం – కుటుంబమే లోకం..

గతంలో పలు ఇంటర్వ్యూలలో మహేశ్ బాబు వెల్లడించిన ప్రకారం.. తమ పెళ్లికి ముందే ఆయన ఒక షరతు విధించారు. పెళ్లి తర్వాత నమ్రత నటనకు దూరంగా ఉండి కుటుంబాన్ని, పిల్లలను చూసుకోవాలని కోరారు.

ఆ సమయంలో మోడలింగ్, సినిమాలతో కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పటికీ.. మహేశ్ కోరికను గౌరవించి నమ్రత సినిమాలకు స్వస్తి చెప్పారు. ఆ నిర్ణయం తీసుకున్నందుకు తనకు ఎలాంటి విచారం లేదని, కుటుంబ జీవితాన్ని ఎంతో సంతోషంగా స్వీకరించానని నమ్రత పలు సందర్భాల్లో స్పష్టం చేశారు.

మోడలింగ్ నుండి అగ్ర కథానాయికగా..

వివాహానికి ముందు నమ్రతా శిరోద్కర్ గ్లామర్ ప్రపంచంలో మరియు బాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా గుర్తింపు పొందారు. 1993లో ‘మిస్ ఇండియా యూనివర్స్’ కిరీటాన్ని గెలుచుకుని వార్తల్లో నిలిచారు.

హిందీలో ‘వాస్తవ్’, ‘పుకార్’, ‘కచ్చే ధాగే’, ‘ఎల్ఓసీ కార్గిల్’ వంటి ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటించి మెప్పించారు. తెలుగులో మహేశ్ సరసన ‘వంశీ’ చిత్రంతో పాటు కన్నడ, మలయాళ భాషల్లోనూ నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో సెలబ్రిటీ హోదా అనుభవిస్తున్న సితారకు పుట్టినరోజు సందర్భంగా మహేశ్ అభిమానులు, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions