Saturday 11th July 2026
12:07:03 PM
Home > తాజా > ‘ఢిల్లీ పెద్దల కుట్రలతో దేశ రాజకీయ పటం మార్పు’

‘ఢిల్లీ పెద్దల కుట్రలతో దేశ రాజకీయ పటం మార్పు’

ఖమ్మం రైతు సభలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

CM Revanth Criticizes Union Govt | కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ (BJP) ప్రభుత్వం ఎలాగైనా సరే భారతదేశ రాజకీయ పటాన్ని తమకు అనుకూలంగా తిరగరాయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

శుక్రవారం ఖమ్మం జిల్లా జగన్నాధపురంలో నిర్వహించిన ‘రైతు ఆశీర్వాద సభ’లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

కేంద్రంలో మళ్లీ పట్టు సాధించేందుకు, ప్రతిపక్షాలను బలహీనపరిచేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ద్వయం కుట్రలు పన్నుతోందని ఆయన మండిపడ్డారు.

డీలిమిటేషన్ బిల్లు 2026తో సీట్ల పెంపు

పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ (TMC)తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)ని కూడా చీల్చడానికి మోదీ-షా ద్వయం కుట్రలు చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.

పార్లమెంటులో సీట్లను పెంచేందుకు ఉద్దేశించిన ‘డీలిమిటేషన్ బిల్లు 2026’, దానికి అనుబంధంగా ఉన్న ‘రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు 2026’లను పార్లమెంటులో ఆమోదింపజేసుకోవడమే కేంద్ర ప్రభుత్వ అసలు లక్ష్యమని రేవంత్ పేర్కొన్నారు.

ఈ బిల్లుల ఆమోదానికి అవసరమైన బలాన్ని పొందేందుకే ఇతర ప్రాంతీయ పార్టీలను వారు లొంగదీసుకుంటున్నారని ధ్వజమెత్తారు.

మోదీ-షా తమ పన్నాగాల్లో విజయం సాధించి ఈ బిల్లులను ఆమోదింపజేసుకుంటే.. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో సమీకరణాలు పూర్తిగా మారిపోతాయన్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 17 పార్లమెంట్ సీట్లు 26కు, అలాగే అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 182కు పెరుగుతాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

‘ఔర్ ఏక్ బార్ కాంగ్రెస్ సర్కార్’.. 117 సీట్లే లక్ష్యం..

గతంలో తాను ఖమ్మం వేదికగానే చేసిన రాజకీయ అంచనాలను సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. “మూడేళ్ల క్రితం ఖమ్మంలో జరిగిన సభలోనే.. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ 65 సీట్లు గెలుస్తుందని నేను అంచనా వేశాను, అలాగే అధికారంలోకి వచ్చాం.

ఇప్పుడు మళ్లీ అదే ఖమ్మం గడ్డపై నుండి చెబుతున్నా.. డీలిమిటేషన్ తర్వాత తెలంగాణలో వచ్చే 182 అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 117 సీట్లు గెలిచి రెండోసారి క్లీన్ స్వీప్‌తో అధికారంలోకి రాబోతోంది.” సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన ‘ఔర్ ఏక్ బార్ కాంగ్రెస్ సర్కార్’ (మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం) అనే సరికొత్త ఎన్నికల నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం 2028 డిసెంబర్‌లో కాకుండా, కేంద్ర నిర్ణయాల వల్ల 2029 మే-జూన్ కాలంలో జరిగే అవకాశం ఉందని ఆయన జోస్యం చెప్పారు.

భద్రాద్రి రామచంద్రస్వామిపై ప్రమాణం చేస్తూ.. రాష్ట్రంలో ప్రజా రంజక ‘రామరాజ్యాన్ని’ స్థాపించడానికి, కాంగ్రెస్ పార్టీని మళ్లీ గెలిపించడానికి మంత్రులు, నాయకులు రోజుకు 18 గంటలు కష్టపడి పనిచేస్తారని సీఎం ప్రకటించారు.

రాహుల్ గాంధీని పీఎం చేయడమే టార్గెట్..

రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో పెరగబోయే లోక్‌సభ స్థానాలను దృష్టిలో ఉంచుకుని (మొత్తం 20 స్థానాల్లో) కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి, రాహుల్ గాంధీని దేశ ప్రధానమంత్రిని చేయడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదే విషయాన్ని అధిష్టానానికి వివరించి, వారికి తెలంగాణ ప్రజల తరఫున హామీ ఇచ్చేందుకు తాను జూలై 20న న్యూఢిల్లీకి వెళ్లనున్నట్లు చెప్పారు. అక్కడ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు వెల్లడించారు.

ఇదిలా ఉండగా.. గత కొంతకాలంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మరియు ఇతర సీనియర్ మంత్రుల మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో, ఈ బహిరంగ సభ వేదికపై మాత్రం కాంగ్రెస్ నేతలందరూ ఎంతో స్నేహపూర్వకంగా, కలిసికట్టుగా ఉంటూ క్యాడర్‌లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions