Pawan Kalyan Emotional Statement On Fan Niranjan Death | జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని, స్థానికంగా ‘చోటా గబ్బర్ సింగ్’గా పిలవబడే పొనుగంటి నిరంజన్ (17) అకాల మరణంపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అరుదైన జన్యు సంబంధిత వ్యాధి, కిడ్నీ సమస్యలతో పోరాడుతూ హనుమకొండలోని తన నివాసంలో నిరంజన్ కన్నుమూసిన సంగతి తెలిసింది.
ఈ విషాద వార్తపై పవన్ కల్యాణ్ స్పందిస్తూ అత్యంత భావోద్వేగంతో కూడిన ఒక అధికారిక శోక సందేశాన్ని విడుదల చేశారు.
‘నువ్వు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ ఉంటుంది’
పవన్ కల్యాణ్ గత నెలలోనే హనుమకొండలోని నిరంజన్ నివాసానికి స్వయంగా వెళ్లి పరామర్శించిన క్షణాలను పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. “నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది.
కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి… నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు… ఇవన్నీ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి.” అని పవన్ కల్యాణ్ పోస్ట్ చేశారు.
అభిమాని చూపిన మనోధైర్యాన్ని కొనియాడుతూ జనసేనాని మరింతగా ఆవేదన చెందారు. “అతని శరీరం వ్యాధితో పోరాడినా, అతని మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచింది.
అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితం పట్ల అతను చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవి. అలాంటి ధైర్యవంతుడైన చిన్నారి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరం” అని పేర్కొన్నారు.
తీరకుండానే మిగిలిపోయిన ‘ఓజీ-2’ ముచ్చట..
చిన్నతనం నుంచే మంచానికే పరిమితమైన నిరంజన్ ఆఖరి కోరిక మేరకు గత నెలలో పవన్ అతడిని కలిశారు. ఆ సమయంలో నిరంజన్ చేసిన డాన్స్ వీడియోలు చూసి మురిసిపోయిన పవన్.. తామిద్దరం కలిసి ప్రత్యేక షో ద్వారా ‘ఓజీ-2’ సినిమా చూద్దామని మాట ఇచ్చారు.
కానీ ఆ ముచ్చట తీరకముందే నిరంజన్ అనంత లోకాలకు వెళ్లిపోవడం అందరినీ కన్నీటిపర్యంతం చేస్తోంది. చివరగా నిరంజన్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన పవన్ కల్యాణ్.. వారికి ఈ తీరని దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించారు.
“ప్రియమైన నిరంజన్… నువ్వు చూపించిన చిరునవ్వు, ధైర్యం, నువ్వు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను” అంటూ నివాళులర్పించారు.
నిరంజన్ కుటుంబానికి సోనూసూద్ వీడియో కాల్..
నిరంజన్ మృతి వార్తపై ప్రముఖ నటుడు, రియల్ హీరో సోనూ సూద్ స్పందించారు. నిరంజన్ అకాల మరణంతో విచారంలో ఉన్న అతని కుటుంబ సభ్యులతో సోనూ సూద్ స్వయంగా వీడియో కాల్‌లో మాట్లాడారు.
ఈ కష్టకాలంలో గుండె నిబ్బరంతో, ధైర్యంగా ఉండాలని ఆ కుటుంబానికి సూచించారు. నిరంజన్ కుటుంబానికి భవిష్యత్తులో ఎలాంటి అవసరమైనా, ఎలాంటి సహాయం కావాలన్నా అందించేందుకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని కొండంత భరోసా ఇచ్చారు.







