Thursday 18th June 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > మెట్రోను మేమెందుకు అడ్డుకుంటాం.. రేవంత్ ఆరోపణలను తిప్పికొట్టిన బండి సంజయ్!

మెట్రోను మేమెందుకు అడ్డుకుంటాం.. రేవంత్ ఆరోపణలను తిప్పికొట్టిన బండి సంజయ్!

bandi sanjay
  • మాకు కాంగ్రెస్ సర్టిఫికెట్ అవసరం లేదు!

Bandi Sanjay On Hyderabad Metro Project | తెలంగాణ మెట్రో ప్రాజెక్టు ఫేజ్-2 (Hyderabad Metro Phase-2) ఆలస్యానికి కేంద్ర ప్రభుత్వ వివక్ష, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డే కారణమంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు.

మంగళవారం (జూన్ 16, 2026) హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

మెట్రో ప్రాజెక్టును అడ్డుకోవాల్సిన అవసరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఏమాత్రం లేదని, ఇలాంటి నిరాధారమైన ఆరోపణలను తాము పట్టించుకోబోమని తేల్చి చెప్పారు. ఈ విషయంలో తమకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి సర్టిఫికెట్లు అవసరం లేదని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.

ఓటర్ల జాబితా నుంచి విదేశీయుల ఓట్లు తొలగించాలి..

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనవసర అంశాలను లేవనెత్తుతూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోందని బండి సంజయ్ విమర్శించారు. దేశంలోకి అక్రమంగా చొరబడిన బంగ్లాదేశ్ జాతీయులకు ఓటు హక్కులు ఎలా కల్పిస్తారని ఆయన ప్రశ్నించారు.

ఓటర్ల జాబితాలో ఉన్న ఇతర దేశాల పౌరుల (నాన్-సిటిజన్స్) ఓట్లను తక్షణమే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ దొంగ ఓట్లను తొలగించాలంటూ కాంగ్రెస్ పార్టీ ఎందుకు డిమాండ్ చేయడం లేదని బండి సంజయ్ నిలదీశారు.

తుపాకీ గొట్టం ద్వారా సాధించేదేమీ లేదు..

భారతదేశంలో మావోయిస్టు (నక్సలైట్) ఉద్యమ ప్రస్థానంపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. సాయుధ పోరాటాల వల్ల దేశంలో సాధించింది ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు.

దశాబ్దాల కాలంగా సాగిన ఈ హింసాత్మక పోరాటంలో ఎందరో అమాయకులు, కనీసం ఆ వివాదం ఏంటో కూడా తెలియని మైనర్లు తుపాకీ గుళ్లకు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.

వారి హింసాత్మక చర్యల వల్లే చివరకు ఆ సంస్థలపై నిషేధం విధించాల్సి వచ్చిందన్నారు. సాయుధ పోరాటం ద్వారా దేనినీ సాధించలేమని ఇప్పుడు అగ్రశ్రేణి మావోయిస్టు నాయకులు సైతం గ్రహించారని, అందుకే చాలా మంది లొంగిపోయి కేంద్ర ప్రభుత్వంతో సహకరిస్తున్నారని తెలిపారు.

ప్రజాస్వామ్యమే ఏకైక మార్గం..

దేశంలో ఇప్పుడు మావోయిస్టు ఉద్యమ ఉనికి ఎక్కడా లేదని బండి సంజయ్ ప్రకటించారు. ఇప్పటికీ మావోయిస్టు భావజాలంతో లక్ష్యాలను సాధించవచ్చని భావిస్తున్న వారు ఆ ఆలోచనలను తక్షణమే విరమించుకోవాలని ఆయన హితవు పలికారు. అభివృద్ధి, ప్రగతి సాధించాలంటే సాయుధ పోరాటం కాదు.. కేవలం ప్రజాస్వామ్యం ఒక్కటే ఏకైక మార్గమని బండి సంజయ్ స్పష్టం చేశారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions