Revanth Reddy Comments On Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో పర్యటించడం, రాజకీయాలు చేయడంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
శుక్రవారం మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్.. పవన్ కళ్యాణ్ పర్యటనలతో పాటు శాంతిభద్రతల సమస్యలు, మధ్యప్రదేశ్ ఎన్నికల పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
పవన్ పర్యటనలకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై వివరణ జూన్ 2వ తేదీన తెలంగాణలో పవన్ కళ్యాణ్ నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చారు.
ఈ నిర్ణయం కేవలం శాంతిభద్రతల (Law and Order) సమస్యలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే తీసుకున్నారని, దీని వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని ఆయన స్పష్టం చేశారు.
“తెలంగాణలో రాజకీయాలు చేసుకునే పూర్తి స్వేచ్ఛ పవన్ కళ్యాణ్ కు ఉంది. (Revanth Reddy Comments On Pawan Kalyan) తెలంగాణలో రాజకీయాలు చేయడానికి, ఎవరైనా పోటీ చేయడానికి అర్హులే,” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల పరిణామాలను కూడా రేవంత్ రెడ్డి స్పందించారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జుంగ్ ఉన్ బీజేపీ నేతలకు ఆదర్శంగా నిలుస్తున్నట్లు కనిపిస్తుందని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై కూడా రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇది కుట్రపూరిత చర్య అని ఆరోపించారు.
“మీనాక్షి నటరాజన్ పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. అయినప్పటికీ ఆమె నామినేషన్ ను తిరస్కరించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది.
మధ్యప్రదేశ్ లో రిటర్నింగ్ అధికారి పూర్తిగా తప్పుగా వ్యవహరించారు. దేశంలో మొదట ఓట్లు చోరీ జరిగింది.. ఇప్పుడు ఏకంగా సీట్లు చోరీకి పాల్పడుతున్నారు,” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
బీజేపీ ప్రజాస్వామ్యాన్ని వెక్కిరిస్తోందని, ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.







