Friday 12th June 2026
12:07:03 PM
Home > తాజా > ‘రాష్ట్రంలో రేవంత్ రెడ్డి హిట్లర్ పాలన’!

‘రాష్ట్రంలో రేవంత్ రెడ్డి హిట్లర్ పాలన’!

  • వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా దక్కవు  
  • కేసీఆర్ వస్తేనే మళ్లీ సుభిక్షం: హరీష్ రావు     

Harish Rao Slams CM Revanth | వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కదంటూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే (మాజీ మంత్రి) తన్నీరు హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అవలంబిస్తున్న ‘హిట్లర్’ తరహా పాలనకు చరమగీతం పాడాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవని ఆయన జోస్యం చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పోయి, కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలనే చర్చ ప్రతిచోటా విస్తృతంగా సాగుతోందని హరీష్ రావు పేర్కొన్నారు.

రాష్ట్రంలో ‘ధ్వని కాలుష్యం’ పెరిగింది..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం వాడుతున్న భాషపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నిత్యం అసభ్య పదజాలం ఉపయోగించడం ఒక అలవాటుగా మార్చుకున్నారని ఆయన విమర్శించారు.

రాష్ట్రంలో వాయు కాలుష్యం తరహాలోనే, రేవంత్ రెడ్డి మాటల వల్ల ‘ధ్వని కాలుష్యం’ (Sound Pollution) పెరిగిపోయిందని ఎద్దేవా చేశారు. ఈ ధ్వని కాలుష్యానికి తగిన బుద్ధి చెప్పి, సీఎంకు సరైన పాఠం నేర్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.

ప్రజా ధనం వృథా.. వందల కోట్ల ఖర్చు..

రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందంటూనే, రేవంత్ రెడ్డి వ్యక్తిగత విలాసాల కోసం వందల కోట్ల ప్రజా ధనాన్ని వృథా చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు.

జూబ్లీహిల్స్‌ లో ఇప్పటికే ఒక భారీ నివాసం ఉన్నప్పటికీ, రేవంత్ రెడ్డి రూ. 100 కోట్లతో ఒక క్యాంప్ ఆఫీస్ నిర్మించారని, అలాగే ఫ్యూచర్ సిటీలో మరో రూ. 100 కోట్లు వెచ్చించి ఇంకో క్యాంప్ ఆఫీస్ కట్టారని మండిపడ్డారు.

ప్రభుత్వం వద్ద ఇప్పటికే హెలికాప్టర్ అందుబాటులో ఉన్నా, నెలకు రూ. 5 కోట్లు వెచ్చించి కొత్త హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు.

ఫుట్‌బాల్ మ్యాచ్‌లు, బ్యూటీ కాంటెస్ట్‌ ల (అందాల పోటీలు) కోసం వందల కోట్ల ప్రజా ధనాన్ని వృథా చేశారని, పొరుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇక్కడి నుంచే డబ్బులు సర్దుబాటు చేశారని ఆరోపించారు.

రైతు డిస్కమ్ పేరుతో మోసం..

రైతాంగాన్ని అన్ని రంగాల్లో వంచించిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు ‘రైతు డిస్కమ్’ పేరుతో మరోసారి మోసం చేయబోతున్నారని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.

వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాల్సింది పోయి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 11 గంటలు మాత్రమే ఇస్తోందని, ఒకవేళ ‘రైతు డిస్కమ్’ గనుక అమలు చేస్తే రైతులకు కేవలం 5 నుండి 6 గంటల విద్యుత్ మాత్రమే అందుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలు మొదలయ్యాయని, నీరు లేక నిలువునా పంటలు ఎండిపోతున్నాయని, రైతులు ఎరువుల కోసం కూడా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎండకాలంలో కూడా కరెంట్, తాగునీటి సమస్యలు రాలేదని, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరిగిందని, కాలువల్లో నీళ్లు పారాయని గుర్తు చేశారు.

రైతుబంధు ఎగ్గొట్టారు..
రైతుబంధు నిధులపై మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక ఇన్‌స్టాల్‌మెంట్‌ను పూర్తిగా ఎగ్గొట్టిందని హరీష్ రావు విమర్శించారు.

ఇటీవల కేవలం 2 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే నిధులు వేసి, దాదాపు రూ. 20,000 కోట్ల రైతుబంధు నిధులను నొకేసి.. తాము రుణమాఫీ చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని మండిపడ్డారు.

కరోనా లాంటి క్లిష్ట సమయంలోనూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుబంధును ఆపలేదని, దేశంలోనే 11 విడతల్లో రూ. 74,000 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసిన ఏకైక నాయకుడు కేసీఆర్ మాత్రమేనని హరీష్ రావు స్పష్టం చేశారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions