- తాత్కాలిక సారథిగా జో రూట్!
- న్యూజిలాండ్‌తో రెండో టెస్టుకు దూరం!
Ben Stokes Suspended By ECB | ఇంగ్లాండ్ టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ మరోసారి తీవ్రమైన వివాదంలో చిక్కుకున్నారు. నైట్ క్లబ్‌లో మద్యం మత్తులో గొడవకు దిగిన కారణంగా ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) అతనిపై కఠినమైన చర్యలు తీసుకుంది.
న్యూజిలాండ్‌తో జరగబోయే కీలకమైన రెండో టెస్ట్ మ్యాచ్ నుండి స్టోక్స్ తో పాటు మరో ఆటగాడిపై బోర్డు వేటు వేసింది.
అసలేం జరిగిందంటే..?
ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన స్టార్ బౌలర్ గుస్ అట్కిన్సన్‌తో కలిసి కెప్టెన్ బెన్ స్టోక్స్ సెలబ్రేషన్స్ కోసం ఒక నైట్ క్లబ్‌కు వెళ్లారు.
అక్కడ మద్యం మత్తులో ఉన్న స్టోక్స్, అట్కిన్సన్ ఇద్దరూ.. స్థానిక రగ్బీ ఆటగాడితో తీవ్ర వాగ్వాదానికి, ఆపై గొడవకు దిగారు. దీనికి సంబంధించిన దృశ్యాలు (వీడియోలు) సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో ఈసీబీ తక్షణమే రంగంలోకి దిగింది.
ఈ క్రమశిక్షణా రాహిత్యాన్ని ఈసీబీ తీవ్రంగా పరిగణించింది. జూన్ 17 నుండి 21 వరకు న్యూజిలాండ్‌తో జరగబోయే రెండో టెస్ట్ మ్యాచ్ జట్టు నుండి బెన్ స్టోక్స్, అట్కిన్సన్ ఇద్దరినీ తక్షణమే తొలగిస్తున్నట్లు బోర్డు ప్రకటించింది.
జో రూట్‌కు కెప్టెన్సీ బాధ్యతలు..
స్టోక్స్ స్థానంలో ఇంగ్లాండ్ మాజీ సారథి జో రూట్ తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం వీరిద్దరి ప్రవర్తనపై అంతర్గత విచారణ కొనసాగుతుందని, నివేదిక ఆధారంగా వారిపై మరింత కఠినమైన శిక్షలు ఉండే అవకాశం ఉందని ఈసీబీ స్పష్టం చేసింది.
స్టోక్స్ కు ఇది మూడోసారి..
బెన్ స్టోక్స్ ఇలాంటి నైట్ క్లబ్ వివాదాల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో 2013 లో ఒకసారి, ఆ తర్వాత 2017 లో బ్రిస్టల్ నైట్ క్లబ్ వెలుపల ఒక వ్యక్తిపై దాడి చేసిన కేసులో అరెస్ట్ అయి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మళ్లీ పాత వివాదాలనే రిపీట్ చేయడంపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు, ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.







