Tuesday 9th June 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ >  ‘హైడ్రా’కు హిట్లర్ స్ఫూర్తా? సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేరళ మాజీ సీఎం ఫైర్..

 ‘హైడ్రా’కు హిట్లర్ స్ఫూర్తా? సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేరళ మాజీ సీఎం ఫైర్..

kerala cm vijayan fires on telangana government
  • కాంగ్రెస్ సమాధానం చెప్పాలని డిమాండ్!

Pinarayi Vijayan Fires On Revanth Reddy | తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేసిన ‘హిట్లర్ స్ఫూర్తి’ వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేరళ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కమ్యూనిస్టు దిగ్గజం పినరయి విజయన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ తీరుపై ఆయన సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు.

అసలు వివాదం ఏమిటంటే..

ఇటీవల బెంగళూరులో జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, హైదరాబాద్‌లో అక్రమ కట్టడాల కూల్చివేతకు ఏర్పాటు చేసిన ‘హైడ్రా’ (HYDRAA) సంస్థ పేరు వెనుక ఉన్న ఆసక్తికర నేపథ్యాన్ని పంచుకున్నారు.

జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ తనకు ఇష్టమైన ఒక పదం స్ఫూర్తితోనే ఈ పేరు పెట్టారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అక్రమార్కుల భరతం పట్టేందుకే హిట్లర్ స్ఫూర్తితో ‘హైడ్రా’కు ఆ నామకరణం చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.

అయితే, ఒక ప్రజాస్వామ్య దేశంలో క్రూర నియంత అయిన హిట్లర్‌ను స్ఫూర్తిగా తీసుకోవడం ఏంటంటూ అటు ప్రతిపక్షాలు, ఇటు రాజకీయ విశ్లేషకులు సీఎం రేవంత్‌పై ధ్వజమెత్తుతున్నారు.

 ఈ వివాదంపై కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ తీవ్రంగా స్పందించారు. “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను ఏర్పాటు చేసిన ‘హైడ్రా’ సంస్థకు హిట్లర్ స్ఫూర్తి అని బహిరంగంగా, గర్వంగా ఒప్పుకోవడం నిజంగా దిగ్భ్రాంతికరం.

ఈ వ్యాఖ్యలు ఆయనకున్న ఆర్‌ఎస్‌ఎస్ (RSS) పాత మూలాలను, ఆయన లోపల దాగున్న ఫాసిస్టు మనస్తత్వాన్ని నిలువునా బట్టబయలు చేస్తున్నాయి. ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయి ఉండి హిట్లర్‌ను సమర్థించడంపై జాతీయ కాంగ్రెస్ అధిష్టానం దేశ ప్రజలకు వెంటనే వివరణ ఇవ్వాలి” అని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు.

మళ్లీ మొదలైన పాత వైరంః నిజానికి కేరళ శాసనసభ ఎన్నికల ప్రచార సమయం నుంచే రేవంత్ రెడ్డి, పినరయి విజయన్ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నడుస్తోంది. అప్పట్లో కేరళ సీఎం హోదాలో ఉన్న విజయన్‌ను టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి విమర్శలు చేయగా, లెఫ్ట్ నేతలు కూడా అంతే గట్టిగా కౌంటర్ ఇచ్చారు.

ఇప్పుడు రేవంత్ రెడ్డి నోటి వెంట వచ్చిన ‘హిట్లర్’ పదాన్ని అస్త్రంగా చేసుకుని కేరళ కమ్యూనిస్టు నేతలు కాంగ్రెస్ పార్టీని జాతీయ స్థాయిలో ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ విమర్శలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేదా కాంగ్రెస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions