Tuesday 9th June 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > వీరాభిమానికి చంద్రబాబు బంపర్ ఆఫర్!

వీరాభిమానికి చంద్రబాబు బంపర్ ఆఫర్!

  • ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఇల్లు మంజూరు చేసిన సీఎం చంద్రబాబు!

ఎప్పటి నుంచో తనను ఒక్కసారైనా చూడాలనుకుంటున్న ఓ సామాన్య అభిమాని కలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిజం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం కామధేనువులంక గ్రామానికి చెందిన సత్యనారాయణకు సీఎం చంద్రబాబు అంటే ప్రాణం.

ఇటీవల తమ నియోజకవర్గానికి చంద్రబాబు వస్తున్నారని, ఈసారైనా దూరం నుంచైనా సరే తన దైవాన్ని చూడాలని ఆరాటపడుతూ సత్యనారాయణ మాట్లాడిన ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. ఆ వీడియో కాస్తా సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్ళింది.

‘ట్విట్టర్’లో రిప్లై ఇచ్చి.. బస్సులోకి పిలిపించి..

సత్యనారాయణ ఆవేదనకు తక్షణమే స్పందించిన సీఎం చంద్రబాబు, సోషల్ మీడియా వేదికగా “సత్యనారాయణ గారూ సిద్ధాంతంలో కలుద్దాం” అంటూ స్వయంగా రిప్లై ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామంలో జరిగిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు విచ్చేశారు.

అధికారిక కార్యక్రమం ముగిసిన వెంటనే, సీఎం చంద్రబాబు తన ఇచ్చిన మాట ప్రకారం సత్యనారాయణను ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుని మరీ తన బస్సులోకి పిలిపించుకున్నారు.

బస్సులో సత్యనారాయణతో సీఎం చంద్రబాబు కాసేపు చాలా ఆత్మీయంగా మాట్లాడారు. ఆయన కుటుంబ వివరాలు, ఆరోగ్యం గురించి ఆరా తీశారు.

వైద్యసాయం కోసం విన్నపం..
ఈ సందర్భంగా సత్యనారాయణ తన కుమారుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడని, అతనికి మెరుగైన వైద్యసాయం అందించాలని ముఖ్యమంత్రిని వేడుకున్నారు. అలాగే తమ గ్రామానికి సరైన డ్రైనేజ్ సదుపాయం కల్పించాలని విన్నవించారు.

అభిమాని కష్టాలను విన్న సీఎం చంద్రబాబు తీవ్రంగా చలించిపోయారు. ఆయా సమస్యలన్నింటినీ త్వరలోనే పరిష్కరిస్తానని భరోసా ఇవ్వడమే కాకుండా.. సత్యనారాయణ కుటుంబానికి తక్షణమే ఒక నూతన ఇల్లు నిర్మించి ఇవ్వాలని అక్కడే ఉన్న జిల్లా కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు.

ముఖ్యమంత్రి అంతటి స్థానంలో ఉండి కూడా, తనలాంటి ఒక సామాన్య కార్యకర్తను, అభిమానిని గుర్తుపెట్టుకుని పిలిచి మాట్లాడటమే కాకుండా ఇల్లు మంజూరు చేయడంపై సత్యనారాయణ ఆనందబాష్పాలు రాల్చారు.

ప్రస్తుతం ఈ అపురూప ఘట్టానికి సంబంధించిన వివరాలు నెట్టింట వైరల్‌గా మారడంతో, చంద్రబాబు నాయుడుగారి మానవత్వాన్ని, అభిమానుల పట్ల ఆయనకున్న ప్రేమని నెటిజన్లు కొనియాడుతున్నారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions