- వైస్ కెప్టెన్‌గా తిలక్ వర్మ!
BCCI Announces India T20 Squad | భారత టీ20 క్రికెట్ జట్టుకు కొత్త సారథి దొరికారు. టీమిండియా టీ20 కొత్త కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌ను నియమిస్తూ బిసిసిఐ (BCCI) శనివారం సంచలన ప్రకటన చేసింది. ఇప్పటివరకు కెప్టెన్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ స్థానంలో అయ్యర్‌కు బోర్డు సారథ్య పగ్గాలు అప్పగించింది.
ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలతో పాటు ఈ ఏడాది జరగబోయే ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్ (Asia Games) కోసం బిసిసిఐ సంయుక్తంగా భారత జట్లను ప్రకటించింది.
వైస్ కెప్టెన్‌గా తిలక్ వర్మ..
ఈ జట్టు ఎంపికలో బిసిసిఐ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న తెలుగు క్రికెటర్ తిలక్ వర్మను టీ20 జట్టుకు వైస్ కెప్టెన్‌గా బోర్డు ఎంపిక చేసింది. గత సిరీస్ వరకు కెప్టెన్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్‌కు ఈసారి ప్రకటించిన జట్టులో కనీసం స్థానం కూడా లభించకపోవడం గమనార్హం.
యువ సంచలనాలకు చాన్స్.. ఐపీఎల్-2026 సీజన్లో పరుగుల విధ్వంసం సృష్టించిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశి అంతర్జాతీయ అరంగేట్రానికి లైన్ క్లియర్ అయింది. తాజాగా ప్రకటించిన భారత జట్టులో వైభవ్‌కు చోటు దక్కింది.
అలాగే లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఐపీఎల్లో అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న యువ పేసర్ ప్రిన్స్ యాదవ్‌కు కూడా తొలిసారి జాతీయ జట్టు నుండి పిలుపు వచ్చింది.
మరోవైపు, సీనియర్ స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రాకు ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్ ల నుండి విశ్రాంతి ఇచ్చారు. అయితే సెప్టెంబర్‌లో జరిగే ఆసియా గేమ్స్ జట్టుకు మాత్రం ఆయనను ఎంపిక చేశారు. అదే సమయంలో, ఆసియా గేమ్స్ కోసం మహ్మద్ సిరాజ్, ప్రిన్స్ యాదవ్‌లకు విశ్రాంతి కల్పించారు.
టీమిండియా షెడ్యూల్ వివరాలు ఇవేః
ఐర్లాండ్ సిరీస్: జూన్ 26, 28 తేదీల్లో ఐర్లాండ్ తో టీమిండియా రెండు టీ-20 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది.
ఇంగ్లాండ్ సిరీస్: అనంతరం జులై 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది.
ఆసియా గేమ్స్: ఈ ఏడాది సెప్టెంబర్ 19వ తేదీ నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్ జరగనున్నాయి.








