Tuesday 2nd June 2026
12:07:03 PM
Home > తాజా > ‘కాంగ్రెస్ పాలనలో తెలంగాణ 25 ఏళ్లు వెనక్కి’

‘కాంగ్రెస్ పాలనలో తెలంగాణ 25 ఏళ్లు వెనక్కి’

రేవంత్ రెడ్డిది నయవంచన..

మరో ప్రజా పోరాటానికి కేటీఆర్ పిలుపు!

KTR Open Challenge To CM Revanth Reddy | తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేళ రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ యుద్ధం పీక్స్‌ కు చేరింది. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన అవతరణ వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని, కాంగ్రెస్ ప్రభుత్వంపై మునుపెన్నడూ లేని విధంగా నిప్పులు చెరిగారు.

అబద్ధాలు, అభూత కల్పనలు, విష ప్రచారాలతో కాంగ్రెస్ పార్టీ అడ్డదారిలో 420 హామీలతో గద్దెనెక్కిందని, అధికారంలోకి వచ్చిన ఈ ముప్పై నెలల్లోనే తెలంగాణను అన్ని రంగాల్లో కుప్పకూల్చి 25 ఏళ్లు వెనక్కి నెట్టిందని తీవ్రంగా ధ్వజమెత్తారు.

వ్యవసాయం సంక్షోభం – రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు..
కేసీఆర్ గారిని బద్నామ్ చేయాలనే కుట్రతోనే కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై పగబట్టిందని కేటీఆర్ ఆరోపించారు. నాలుగు సార్లు రైతుబంధు ఎగగొట్టిన నయవంచకుడు రేవంత్ రెడ్డి అని కేటీఆర్ విమర్శించారు.
రైతన్నలకు సకాలంలో యూరియా ఇవ్వని చేతగాని అసమర్థ ముఖ్యమంత్రి అని, పండించిన పంటను రెండు నెలలైనా కొనలేని సన్నాసి రేవంత్ రెడ్డి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

గతంలో సంతోషంగా సాగిన వ్యవసాయం నేడు సంక్షోభంలో కూరుకుపోయిందని, 70 లక్షల తెలంగాణ రైతన్నలు రేవంత్ రెడ్డిని అడ్డగోలుగా తిడుతున్నారని పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి జలాలను తన ‘గురువుగారికి’ సంతర్పణ చేసే కార్యక్రమానికి రేవంత్ తెరలేపారని ఆరోపించారు.

నిరుద్యోగులపై మోసం – రాహుల్ గాంధీకి ప్రశ్నలు..
అశోక్ నగర్ సాక్షిగా నిరుద్యోగ విద్యార్థులను, యువతను కాంగ్రెస్ పార్టీ నట్టేట ముంచిందని కేటీఆర్ మండిపడ్డారు. రెండున్నరేళ్ల పాలనలో కనీసం 4000 కొత్త ఉద్యోగాలు కూడా ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం, మరి రెండున్నర సంవత్సరాలుగా సన్నాసి రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు.

యువతను మోసం చేసినందుకు తెలంగాణకు రావడానికి రాహుల్ గాంధీకి మొహం చెల్లడం లేదని ఎద్దేవా చేశారు.

సీఎం రేవంత్ రెడ్డికి ఓపెన్ ఛాలెంజ్..
“దమ్ముంటే పోలీసులు లేకుండా చిక్కడపల్లి లైబ్రరీకి, అశోక్ నగర్ చౌరస్తాకు వచ్చి నిరుద్యోగ యువతను కలుస్తావా?” అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ సవాల్ విసిరారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, పట్టపగలే హత్యలు జరుగుతూ గనుల దోపిడీ విచ్చలవిడిగా సాగుతోందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ఒక్క రూపాయి ఇవ్వకుండానే రేవంత్ రెడ్డి నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారని ఆరోపించారు.

తెలంగాణ ప్రజలకు రూపాయి దక్కడం లేదు కానీ, ఢిల్లీలో రాహుల్ గాంధీ అకౌంట్లో మాత్రం ‘టింగు టింగుమని’ నిధులు పడుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.

“మన పోరాటం అధికారం కోసం కాదు.. కష్టపడి సాధించుకున్న తెలంగాణను కాపాడుకోవడం కోసం” అని స్పష్టం చేస్తూ, తెలంగాణ తల్లి కిరీటాన్ని, వడ్డాణాన్ని దొంగిలించిన ముష్కరుల నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ మరో ప్రజా పోరాటానికి సిద్ధం కావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రమంతా ముక్తకంఠంతో “కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలి” అంటోందని కేటీఆర్ స్పష్టం చేశారు.

You may also like
సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం!
పోచంపల్లిలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు!
విద్రోహ శక్తుల నుండి రాష్ట్రాన్ని కాపాడుకుందాం: కేసీఆర్
జూన్ 2 ఒక భావోద్వేగ సందర్భం: సీఎం రేవంత్ రెడ్డి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions