- నన్ను అడ్డుకునే మొనగాడు ఎవడు?
- సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కళ్యాణ్ ఓపెన్ ఛాలెంజ్!
“తెలంగాణ నడిబొడ్డున పుట్టిన జనసేన పార్టీ ఇక్కడే ఉంటుంది.. నేను స్వయంగా ఇక్కడ తిరుగుతాను.. ఏం చేసుకుంటారో చేసుకోండి” అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయ నాయకులకు సవాల్ విసిరారు.
జనసేన తలపెట్టిన సభ రద్దు కావడంతో జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తనను బెదిరిస్తున్న లీడర్లపై పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
తెలంగాణ ఏమైనా మీ అయ్య జాగీరా?
తెలంగాణలో తనను తిరగనివ్వబోమంటూ కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. “పవన్ కళ్యాణ్‌ను తెలంగాణకు రానివ్వం అంటున్నారు.. ఇదేమైనా మీ అయ్య జాగీరా? నన్ను బెదిరించడానికి మీరెవరు?” అంటూ పవన్ నిలదీశారు.
భయపడేవాళ్లమైతే అసలు రాజకీయ పార్టీనే పెట్టేవాళ్లం కాదని, తనకు తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే బెదిరింపులు ఎక్కువని వ్యాఖ్యానించారు.
తాను తెలంగాణ కోసం పోరాటాలు చేసినప్పుడు, ఇక్కడి తండాల దాహార్తిని తీర్చినప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్న నాయకులంతా ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. తెలంగాణపై తనకు ఉన్న ప్రేమ రాజకీయాలకు అతీతమైనదని స్పష్టం చేశారు.
విభజన తీరుకే మా వ్యతిరేకత..
జనసేన పార్టీ తెలంగాణకు వ్యతిరేకమంటూ జరుగుతున్న ప్రచారాన్ని పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. తాము తెలంగాణ రాష్ట్ర విభజనకు గానీ, ఇక్కడి సంస్కృతికి గానీ ఎన్నడూ వ్యతిరేకం కాదని.. కేవలం పార్లమెంట్ తలుపులు మూసి విభజించిన ‘తీరు’ను మాత్రమే తప్పుబట్టామని పవన్ గుర్తుచేశారు.
సామాజిక తెలంగాణ రావాలనే ఆకాంక్షతోనే తాను వచ్చానని చెప్పారు. అప్పుడు ఊడిగం చేశారు: నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి సమైక్యాంధ్ర అని విభజనకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఈ నాయకులంతా ఏం చేస్తున్నారని, అప్పుడు మాట్లాడకుండా వైఎస్సార్‌కు ఊడిగం చేశారని మండిపడ్డారు.
సీఎం రేవంత్ రెడ్డికి కబ్జా సవాల్..
తనపై వస్తున్న భూ ఆక్రమణల ఆరోపణలపై పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
తాను చెరువును ఆక్రమించానని వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని.. ఒకవేళ తాను కబ్జా చేసినట్లు నిరూపణ అయితే, ఆ భూమిని వెంటనే స్వాధీనం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి స్పష్టం చేశారు.
ఆంధ్రా ప్రజలపై తెలంగాణ వాసులకు ఎలాంటి విద్వేషం లేదని, పాలకులు వేరు, ప్రజలు వేరని తేల్చి చెప్పారు. ఇప్పటివరకు ఎన్నోసార్లు తగ్గి ఉన్నామని, ఎవరినీ రెచ్చగొట్టడం ఇష్టం లేకే ఇన్నాళ్లూ భరించామని చెప్పారు.
అయితే, తెలంగాణలో లక్ష మంది జనసైనికులు ఉన్నారని.. ఇకపై జనసేన ఇక్కడ బలోపేతమవడమే కాకుండా ఎన్నికల్లో పోటీ కూడా చేస్తుందని, ఏం చేస్తారో చేసుకోండి అంటూ పవన్ కళ్యాణ్ పొలిటికల్ వార్నింగ్ ఇచ్చారు.







