Tuesday 2nd June 2026
12:07:03 PM
Home > తాజా > సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం!

సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం!

  • ఈ నెలలోనే మరిన్ని కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు..
  • ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు!

తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమానికి, అభివృద్ధికి తమ కాంగ్రెస్ ప్రభుత్వం సమాన ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలో అత్యంత పారదర్శకంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో ఘనంగా నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ flag (పతాకాన్ని) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన సుదీర్ఘ ప్రసంగం చేశారు.

తెలంగాణ సమాజం రాచరికాన్ని, పెత్తనాన్ని ఎన్నటికీ సహించదని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రత్యేక రాష్ట్ర కలని సాకారం చేసిన నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీలకు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ప్రజాకవి కాళోజీ నారాయణరావు స్ఫూర్తితో, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యంగా తమ ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ‘తెలంగాణ విజన్-2047’ లక్ష్యం దిశగా అడుగులు వేస్తూ, రాష్ట్ర రైతులను వ్యవసాయ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు.

నిరుద్యోగులకు తీపి కబురు ..
ఉద్యోగాల భర్తీపై నిరుద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి పెద్ద భరోసా ఇచ్చారు. ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా, అత్యంత పారదర్శకంగా ఇప్పటివరకు 67 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని ముఖ్యమంత్రి వెల్లడించారు.

ఈ భర్తీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ నెలలోనే టిజిపిఎస్సి (TGPSC) ద్వారా ఇంజినీరింగ్‌, పీసీబీ (PCB), అటవీశాఖ, టౌన్‌ప్లానింగ్‌, విద్యాశాఖల్లో మరిన్ని కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి అధికారికంగా ప్రకటించారు.

విద్యార్థులకు ఉచిత బ్రేక్‌ఫాస్ట్.. జూనియర్ కాలేజీలకు మధ్యాహ్న భోజనం..
రాష్ట్రంలోని విద్యావ్యవస్థ బలోపేతానికి తమ ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక చర్యలను సీఎం వివరించారు. విద్యా సంస్కరణల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 1,362 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతులను ప్రారంభించినట్లు తెలిపారు.

ఈ విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా ఉదయం బ్రేక్‌ఫాస్ట్ (అల్పాహారం) అందిస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని త్వరలోనే అమలు చేయబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

ఇందిరమ్మ ఇళ్లు.. కొత్త రేషన్ కార్డుల పంపిణీ పూర్తి..
పేద ప్రజలను అద్దె ఇళ్ల బాధల నుంచి విముక్తి చేయడమే తమ ప్రభుత్వ సంకల్పమని సీఎం స్పష్టం చేశారు. గత 13 నెలల కాలంలో రూ.22 వేల కోట్ల భారీ వ్యయంతో 1.25 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇచ్చినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 3.50 లక్షల ఇళ్లను మంజూరు చేశామని, ఈసారి క్యూర్‌ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని స్పష్టం చేశారు. పేదలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను కూడా విజయవంతంగా పూర్తి చేశామని వివరించారు.

ఈ ఆవిర్భావ వేడుకల ముగింపులో భాగంగా, రాష్ట్రంలో ఉత్తమ సేవలు అందించిన పలువురు పోలీసు అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ‘విశిష్టసేవా పురస్కారాలను’ ప్రదానం చేశారు.

You may also like
‘కాంగ్రెస్ పాలనలో తెలంగాణ 25 ఏళ్లు వెనక్కి’
పోచంపల్లిలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు!
విద్రోహ శక్తుల నుండి రాష్ట్రాన్ని కాపాడుకుందాం: కేసీఆర్
జూన్ 2 ఒక భావోద్వేగ సందర్భం: సీఎం రేవంత్ రెడ్డి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions