– 2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం..
- సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రసంగం!
CM Revanth Reddy Speech In Mahila Shakti | “తెలంగాణ ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే రాష్ట్రం కూడా ఆర్థికంగా బలోపేతం అవుతుంది.
అందుకే కార్పొరేట్ శక్తులకు దీటుగా తెలంగాణ మహిళా స్వయం సహాయక సంఘాలను (SHGs) కోటీశ్వరులుగా మార్చడమే మా ప్రభుత్వ లక్ష్యం” అని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని పవర్‌ఫుల్ స్పీచ్ ఇచ్చారు.
ఈ సందర్భంగా మహిళా శక్తిని విశ్వవ్యాప్తం చేసేలా.. దేశంలోనే ఇప్పటివరకు ఏ రాష్ట్రం తీసుకోని వినూత్న విప్లవాత్మక నిర్ణయాలను, భారీ కేటాయింపులను సీఎం వేదికగా ప్రకటించారు.
1. ఒకేసారి 8,000 భవనాలకు శంకుస్థాపన – దేశంలోనే రికార్డ్: మహిళా సంఘాల బలోపేతం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు, ఒకే సమయంలో 8,000 మహిళా సంఘాల భవనాలకు శంకుస్థాపన చేస్తున్నామని, దేశ చరిత్రలోనే ఇదొక సంచలన నిర్ణయమని సీఎం పేర్కొన్నారు.
2. ఉచిత బస్సు ప్రయాణం – రూ.10 వేల కోట్ల రీయింబర్స్‌మెంట్: మహాలక్ష్మి పథకం విజయం: 2023 డిసెంబర్ 7న ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు.
ఉచిత ప్రయాణం వద్దంటూ కొందరు కుట్రలు చేసి, మహిళలను రెచ్చగొట్టినా వెనకడుగు వేయకుండా ఇప్పటివరకు ఆర్టీసీకి 10,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం రీయింబర్స్ చేసిందని స్పష్టం చేశారు.
మహిళలే బస్సు యజమానులు..
మహిళలను బస్సులకు యజమానులను చేయాలనే సంకల్పంతో 1000 బస్సులను కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా ప్లాన్ చేశామన్నారు. ఇందులో భాగంగా జూన్ 5న పరేడ్ గ్రౌండ్స్‌లో 553 సరికొత్త బస్సులను ప్రారంభించబోతున్నట్లు సీఎం లీక్ ఇచ్చారు.
అదానీ, అంబానీ బిజినెస్‌లలోకి తెలంగాణ మహిళలు..
కార్పొరేట్ వ్యాపారాలను గ్రామీణ మహిళలకు అప్పగించేలా ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయాలను రేవంత్ రెడ్డి వివరించారు.
“సోలార్ ఎనర్జీ అనగానే అదానీ, అంబానీలు గుర్తుకొస్తారు. కానీ తెలంగాణలో మహిళా సంఘాలతోనే 1000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయిస్తున్నాం” అని సీఎం ప్రకటించారు.
రిలయన్స్ కి దీటుగా పెట్రోల్ బంకులు..
రిలయన్స్ లాంటి పెద్ద కంపెనీలు చేసే పెట్రోల్ బంకుల వ్యాపారాన్ని ఇకపై మన మహిళా స్వయం సహాయక సంఘాలతో చేయిస్తామన్నారు.
లోన్ల పరిమితి పెంపు..
మహిళల వ్యాపారాల కోసం బ్యాంక్ లింకేజీ లోన్ల పరిమితిని రూ.5 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకు రూ.60 వేల కోట్ల బ్యాంక్ లింకేజీ లోన్లు అందించామని, సున్నా వడ్డీ రుణాల కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.1,390 కోట్లు చెల్లించిందని గుర్తుచేశారు.
బడా వ్యాపారులు అప్పులు ఎగ్గొట్టి పారిపోతుంటే.. మహిళలు మాత్రం తీసుకున్న ప్రతి రూపాయిని నిక్కచ్చిగా చెల్లిస్తున్నారని కొనియాడారు.
డీమార్ట్, బిగ్ బజార్ల కంటే బెస్ట్ గా ‘మహిళా శక్తి సూపర్ బజార్లు’: మహిళా సంఘాలు కేవలం అప్పులు తీసుకోవడమే కాకుండా పెద్ద ఎత్తున పరిశ్రమలు స్థాపించాలని సీఎం పిలుపునిచ్చారు.
రైస్ మిల్లులు & గోడౌన్లు.. మహిళా సంఘాలు సొంతంగా రైస్ మిల్లులు, మండలాల్లో గోడౌన్లు, ప్లాస్టిక్ పార్కులు ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం 100 ఎకరాల వరకు ప్రభుత్వ భూములను కేటాయించడానికి సిద్ధంగా ఉందన్నారు.
ఇకపై మిల్లుల గోడౌన్లలో ధాన్యం స్టాక్స్ పెట్టబోమని.. స్వయం సహాయక సంఘాలే నేరుగా వడ్లు కొనుగోలు చేసి, బియ్యం ఆడించి ప్రభుత్వానికి ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. దీనికోసం సున్నా వడ్డీతో బ్యాంక్ లింకేజీ రుణాలు ఇస్తామన్నారు.
కార్పొరేట్ తరహా సూపర్ బజార్లు..
“డీమార్ట్ (DMart), బిగ్ బజార్ల కంటే అద్భుతంగా ఉండేలా ‘మహిళా శక్తి సూపర్ బజార్లు’ కార్పొరేట్ తరహాలో ఏర్పాటు చేయాలి. నాణ్యమైన వస్తువులు ఇక్కడ లభిస్తాయి.
ఈ సూపర్ బజార్లలో రాష్ట్ర ప్రభుత్వం కూడా వాటాదారుగా (Partner) ఉంటుంది. పట్టణ ప్రాంతాలలో వీటి స్థాపన కోసం ప్రభుత్వ భూములను చాలా తక్కువ ధరకే లీజుకు ఇస్తాం” అని సీఎం హామీ ఇచ్చారు.
‘చిలుక పచ్చ’ ఇందిరమ్మ చీరలు..
గత ప్రభుత్వం పంపిణీ చేసిన చీరలపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటైన విమర్శలు చేశారు. “గతంలో ఇచ్చిన చీరలు నాసిరకంగా ఉండటం వల్ల వాటిని పంట పొలాల్లో పిట్టలను కొట్టడానికి ఉపయోగించారు.
కానీ మన ప్రజా ప్రభుత్వం ఇస్తున్న ఇందిరమ్మ చీరలతో ఆడబిడ్డలు పాలపిట్టల్లా కనిపిస్తున్నారు. త్వరలోనే పట్టణ ప్రాంతాల్లో కూడా ‘చిలుక పచ్చ’ రంగులో నాణ్యమైన ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తాం” అని ప్రకటించారు.
ప్రసంగం ముగింపులో సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థులను ఉద్దేశించి ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. “ఈ మధ్య కొందరు అన్నదమ్ములు ఇళ్లలో నుంచి సొంత చెల్లెళ్లను బయటకు వెళ్లగొడుతున్నారు. అలా రాజకీయాల్లో కొందరు చెల్లెళ్లను బయటకు పంపితే.. ఆమె బయటకు వచ్చి ఎలా శాపనార్థాలు పెడుతుందో మనం లైవ్ లో చూస్తున్నాం” అంటూ పరోక్షంగా సెటైర్లు వేశారు.
2034 నాటికి రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే బలమైన లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తోందని, ఈ ప్రజా ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చే అసలైన శక్తి మహిళలకే ఉందని సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు.







