BRS 25-year silver jubilee celebrations | తెలంగాణ రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నేటితో 25 వసంతాలను పూర్తి చేసుకుంది. 2001, ఏప్రిల్ 27న కేసీఆర్ ప్రారంభించిన ఈ ప్రస్థానం ఇప్పుడు ‘సిల్వర్ జూబ్లీ’ మైలురాయిని చేరుకుంది.
ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా కార్యకర్తలకు, అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ఉద్వేగభరితమైన పోస్ట్ చేశారు.
“నెత్తురు మండి ఒక జాతి ఎత్తిన జెండా.. పాతికేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న పునరంకిత సందర్భం ఇది” అని కేటీఆర్ పేర్కొన్నారు. స్వీయ రాజకీయ అస్తిత్వ పతాకం రెపరెపలాడుతూ సిల్వర్ జూబ్లీ ముగింపు వేడుకలు జరుపుకోవడం గర్వకారణమని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ అనేది కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని, అది ఒక విప్లవమని ఆయన అభివర్ణించారు. ఈ 25 ఏళ్ల లాంగ్ మార్చ్‌లో వెన్నంటి నిలిచిన పార్టీ కార్యకర్తలకు, సోషల్ మీడియా వారియర్లకు, నాయకులకు ఆయన శిరస్సు వంచి ప్రణామాలు అర్పించారు.
రజతోత్సవ వేడుకల సందర్భంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో, పట్టణంలో గులాబీ జెండాను ఎగురవేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.






