Friday 3rd April 2026
12:07:03 PM
Home > తాజా > తెలంగాణలో కొత్త పెన్షన్లు.. 2 లక్షల మందికి ‘చేయూత’

తెలంగాణలో కొత్త పెన్షన్లు.. 2 లక్షల మందికి ‘చేయూత’

ts govt logo

New Pensions In Telangana | తెలంగాణలో కొత్త పెన్షన్ల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న లక్షలాది మంది నిరుపేదలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్టకేలకు తీపి కబురు అందించింది. ప్రతిష్టాత్మక ‘చేయూత’ పథకం కింద కొత్తగా మరో 2 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేయాలని నిర్ణయించింది.

ఇందుకోసం 2026-27 వార్షిక బడ్జెట్‌లో రూ. 233 కోట్లను ప్రత్యేకంగా కేటాయించడంతో, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు అధికారికంగా రంగం సిద్ధమైంది. గత మూడేళ్లుగా కేవలం బోదకాలు, డయాలసిస్ బాధితులకు తప్ప ఇతర వర్గాలకు కొత్త పెన్షన్లు అందకపోవడంతో, తాజా నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేటగిరీలలో దాదాపు 42.23 లక్షల మంది నెలనెలా చేయూత పెన్షన్లు పొందుతున్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత మరియు చేనేత కార్మికులతో పాటు హెచ్‌ఐవీ, బోదకాలు బాధితులకు నెలకు రూ. 2,016 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది.

ఇక దివ్యాంగులకు అత్యధికంగా రూ. 4,016 పెన్షన్‌గా ఇస్తున్నారు. ఇప్పుడు ఈ భారీ జాబితాలోకి మరో రెండు లక్షల మంది కొత్తగా చేరనుండటంతో ప్రభుత్వపై అదనపు ఆర్థిక భారం పడనుంది. అయినప్పటికీ, అర్హులైన ప్రతి ఒక్కరికీ సామాజిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ అడుగు వేసింది.

అయితే, ఈ ప్రక్రియలో అధికారుల ముందు ఒక భారీ సవాల్ పొంచి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం సుమారు 12 లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.

వీటిలో వృద్ధాప్య పెన్షన్ కోసం 4 లక్షలు, వితంతు మరియు ఒంటరి మహిళల కోటాలో 3.5 లక్షలు, గీత, చేనేత కార్మికుల విభాగంలో 3 లక్షలు, దివ్యాంగుల పింఛన్ కోసం 72 వేల దరఖాస్తులు ఉన్నాయి.

ప్రభుత్వం ఆమోదించినవి కేవలం 2 లక్షల పెన్షన్లే కావడంతో, మిగిలిన 10 లక్షల దరఖాస్తుల నుంచి అత్యంత అర్హులను గుర్తించడం అధికారులకు కత్తిమీద సాములా మారింది.

ఈ క్రమంలోనే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు పటిష్టమైన వడపోత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఫిబ్రవరి 20 నుంచి ‘ప్రజావాణి’ ద్వారా అందిన దరఖాస్తులతో పాటు, గురువారం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న గ్రామసభల్లో వచ్చే కొత్త అప్లికేషన్లను కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు.

క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, ఎక్కడా రాజకీయ జోక్యం లేకుండా, కేవలం ఆర్థిక స్థితిగతుల ఆధారంగానే పారదర్శక పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. త్వరలోనే ఈ 2 లక్షల మందికి కొత్త పెన్షన్ కార్డులు పంపిణీ చేయనున్నారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions