Wednesday 1st April 2026
12:07:03 PM
Home > తాజా > ‘ట్యాంక్‌బండ్ శివ’ కుటుంబానికి సీఎం రేవంత్ సాయం!

‘ట్యాంక్‌బండ్ శివ’ కుటుంబానికి సీఎం రేవంత్ సాయం!

tankbund shiva

CM Revanth Reddy helps Tank Bund Shiva | హుస్సేన్ సాగర్ అలల మధ్య ఎంతోమంది ప్రాణాలను కాపాడి ‘సాహసానికి మారుపేరు’గా నిలిచిన ట్యాంక్‌బండ్ శివకు తెలంగాణ ప్రభుత్వం ఘనమైన గుర్తింపునిచ్చింది.

ప్రమాదవశాత్తు లేదా ఆత్మహత్యాయత్నం చేస్తూ సాగర్ లో పడిపోయిన వందలాది మందిని తన ప్రాణాలకు తెగించి కాపాడిన శివ, గత కొంతకాలంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారన్న వార్తలపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించారు.

మంగళవారం శివ కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా పిలిపించుకున్న సీఎం, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మానవత్వంతో ఇతరుల ప్రాణాలు కాపాడుతున్న శివ వంటి వ్యక్తులను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యతని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కొనియాడారు.

శివ నిరుపేద స్థితిని గమనించిన ముఖ్యమంత్రి, తక్షణ సహాయం కింద ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించి, దానికి సంబంధించిన పత్రాలను అందజేశారు. కేవలం ఆర్థిక సాయంతోనే సరిపెట్టకుండా, ఆ కుటుంబానికి శాశ్వత జీవనోపాధి కల్పించేలా కీలక నిర్ణయం తీసుకున్నారు.

శివ కుమారుడు వేణుమాధవ్‌కు హోంగార్డు ఉద్యోగం కల్పిస్తూ నియామక పత్రాన్ని (Appointment Order) స్వయంగా అందజేశారు. అలాగే, శివ కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ భేటీలో శివ తన చిరకాల వాంఛను ముఖ్యమంత్రి ముందుంచారు. తనకు ఉపాధి కల్పించడంతో పాటు మరికొందరికి ఈతలో శిక్షణ ఇచ్చేందుకు ట్యాంక్‌బండ్ సమీపంలో ఒక స్విమ్మింగ్ పూల్ నిర్మించి ఇవ్వాలని కోరారు.

దీనిపై సానుకూలంగా స్పందించిన రేవంత్ రెడ్డి, తక్షణమే ఆ దిశగా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ అండతో శివ కుటుంబం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తోంది.

ప్రాణాలు కాపాడే ఒక సామాన్యుడి కష్టాన్ని గుర్తించి, గౌరవప్రదమైన జీవితాన్ని ప్రసాదించిన ముఖ్యమంత్రిపై నగరవాసుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions