Monday 23rd March 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > దేశంలో ఇంధన నిల్వలపై ప్రధాని మోదీ కీలక ప్రకటన!

దేశంలో ఇంధన నిల్వలపై ప్రధాని మోదీ కీలక ప్రకటన!

modi in loksabha

PM Modi Statement On Fuel In India | పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇంధన నిల్వలపై ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) లోక్ సభలో కీలక ప్రకటన చేశారు.

దేశంలో పెట్రోల్, డీజిల్ మరియు ఎల్‌పీజీ (LPG) సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని ప్రధాని హామీ ఇచ్చారు.

ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన ‘హార్ముజ్ జలసంధి’ మార్గంలో నౌకల ప్రయాణం యుద్ధం కారణంగా సవాలుగా మారిందని ప్రధాని పేర్కొన్నారు.

భారత్‌కు వచ్చే ముడి చమురు, గ్యాస్ మరియు ఎరువులు అధిక శాతం ఈ మార్గం గుండానే వస్తాయని, అయినప్పటికీ సరఫరా గొలుసు దెబ్బతినకుండా ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలతో వ్యవహరిస్తోందని చెప్పారు.

గత దశాబ్ద కాలంలో భారత్ తన ఇంధన నిల్వ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకుందని మోదీ తెలిపారు. ప్రస్తుతం దేశం వద్ద 53 లక్షల మెట్రిక్ టన్నుల వ్యూహాత్మక చమురు నిల్వలు (Strategic Petroleum Reserves) ఉన్నాయని వెల్లడించారు.

ఈ సామర్థ్యాన్ని 65 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచే పనులు జరుగుతున్నాయి. వీటితో పాటు చమురు కంపెనీలు కూడా తమ వద్ద ప్రత్యేక నిల్వలను నిర్వహిస్తున్నాయని ఆయన వెల్లడించారు.

భారత్ తన ఎల్‌పీజీ అవసరాల కోసం 60% దిగుమతులపైనే ఆధారపడుతోందని, అంతర్జాతీయ అనిశ్చితి ఉన్నప్పటికీ గృహ వినియోగదారులకు ఎల్‌పీజీ సరఫరాలో ఇబ్బంది లేకుండా ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రధాని స్పష్టం చేశారు.

దేశీయంగా ఎల్‌పీజీ ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడంలో ఇథనాల్ బ్లెండింగ్ కీలక పాత్ర పోషిస్తోందని ప్రధాని వివరించారు.

గత పదేళ్లలో పెట్రోల్‌లో ఇథనాల్ కలయిక 1% నుండి 20%కి పెరిగింది. దీనివల్ల గత ఏడాది సుమారు 4.5 కోట్ల బారెళ్ల ముడి చమురు దిగుమతులను తగ్గించుకోగలిగామని ఆయన గర్వంగా ప్రకటించారు.

యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న భారతీయుల రక్షణ కోసం 24×7 కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని, ఇంధన భద్రత విషయంలో ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని ప్రధాని పునరుద్ఘాటించారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions