Bandi Sanjay on TG Budget | తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్‌పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఇది అంకెల గారడీ తప్ప సామాన్యుడికి ఒరిగేదేమీ లేదని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ‘హ్యాట్రిక్’ కొట్టిందని విమర్శించారు.
ఆదాయం పెంచడం చేతకాక, అప్పుల కోసం అర్రులు చాచే బడ్జెట్ ఇది. మరో లక్ష కోట్ల అదనపు అప్పు మోపేందుకు సిద్ధమవ్వడం సిగ్గుచేటు. రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించడంలో కాంగ్రెస్ వరుసగా మూడో బడ్జెట్‌తో హ్యాట్రిక్ సాధించింది” అని మండిపడ్డారు.
రైతు భరోసా నిధులను రెండు విడతలుగా ఎగ్గొట్టినట్లేనా? అని ప్రశ్నించారు. కౌలు రైతులు, వ్యవసాయ కూలీలకు రూపాయి బిళ్ల కూడా ఇవ్వకుండా వారి నోట్లో మట్టి కొట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలకు ఈ బడ్జెట్ ‘పాడె’ కట్టేలా ఉందని ఎద్దేవా చేశారు.
తులం బంగారం ‘తుస్’ అయింది.. ₹2500 ఊసే లేదు. ₹4 వేల పెన్షన్ పెంపు ప్రస్తావనే లేదు. నిరుద్యోగ భృతి అంశమే బడ్జెట్‌లో కనిపించలేదు. ₹5 లక్షల భరోసా కార్డులకు నిధుల కేటాయింపు సున్నా. 56 శాతం జనాభా ఉన్న బీసీలకు కేవలం 4 శాతం నిధులు కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు.
గతంలో ₹190 కోట్లు ఇస్తే, ఈసారి ఆ ప్రస్తావనే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషన్ 16 శాతం నిధులు అడిగితే, ప్రభుత్వం 8 శాతానికే పరిమితం చేసిందన్నారు. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే గోదావరి పుష్కరాలకు కంటితుడుపు కేటాయింపులు చేశారని విమర్శించారు.
దావోస్, గ్లోబల్ సమ్మిట్ పేరుతో లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెబుతున్న ప్రభుత్వం.. ఆ వివరాలను వెల్లడించే దమ్ముందా? అని సవాల్ విసిరారు. బీజేపీ అధికారంలోకి రాగానే గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ చేసిన అప్పుల భాగోతంపై విచారణ జరిపిస్తామని హెచ్చరించారు.






