- వెనుక ఉన్న అసలు సందేశం ఏమిటో తెలుసా?
War vs Mars Exploration Cost | “ఒకవైపు అంగారక గ్రహంపై జీవం కోసం వేల కోట్లు ఖర్చు పెడతాడు. మరోవైపు భూమిపై ఉన్న జీవాన్ని తుడిచిపెట్టడానికి లక్షల కోట్లు తగలేస్తాడు. మనిషి నిజంగానే పిచ్చోడు కదూ!” –
ఇది రాజ్యసభ సభ్యులు, ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఫోటో సారాంశం. పశ్చిమాసియా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాల నేపథ్యంలో ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఆ ఫోటోలో ఏముంది?
సింఘ్వీ షేర్ చేసిన ఫోటోలో.. బ్యాక్‌గ్రౌండ్‌లో బాంబుల వర్షం కురుస్తోంది. ఇళ్లు, బిల్డింగులు పేలిపోతూ ఆకాశమంతా నల్లటి పొగ కమ్ముకుంది.
ఆ విధ్వంసాన్ని దూరంగా ఒక బెంచ్ మీద కూర్చుని ఏనుగు, సింహం, జిరాఫీ, జీబ్రా వంటి జంతువులు నిశ్శబ్దంగా చూస్తున్నాయి.
వాటి పక్కనే ఇద్దరు గ్రహాంతరవాసులు (Aliens) కూడా కూర్చుని ఉన్నారు. వారిలో ఒక ఏలియన్ మిగతా జంతువులతో.. “Humans are really stupid” (మనుషులు నిజంగానే పిచ్చోళ్ళు) అని అంటున్నట్లు ఆ ఫోటోలో ఉంది.
సింఘ్వీ ప్రశ్న: విధ్వంసానికా? వికాసానికా?
ఈ ఫోటోను షేర్ చేస్తూ సింఘ్వీ గారు లేవనెత్తిన ప్రశ్న ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది. మనిషి భూమికి అవతల ఉన్న అంగారక గ్రహం (Mars) మీద జీవం ఉందా?
భవిష్యత్తులో అక్కడ మానవజాతి మనుగడ సాధ్యమా? అని తెలుసుకోవడానికి వేలాది కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నాడు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కొత్త లోకాలను కనిపెట్టాలని తపిస్తున్నాడు.
అదే సమయంలో, భూమిపై అత్యంత సంతోషంగా సాగుతున్న జీవనాన్ని, పచ్చటి ప్రకృతిని నాశనం చేయడానికి కూడా లక్షల కోట్ల రూపాయలను ఆయుధాలు, బాంబుల కోసం ఖర్చు చేస్తున్నాడు.
దేశాధినేతల అహంకారం, స్వార్థపూరిత నిర్ణయాల వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.






