Friday 13th March 2026
12:07:03 PM
Home > తాజా > ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు.. వారికి మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్!

ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు.. వారికి మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్!

Minister Warning Over LPG Scarcity | రాష్ట్రంలో ఎల్‌పీజీ (LPG) గ్యాస్ సిలిండర్ల కృత్రిమ కొరత సృష్టించి, బ్లాక్ మార్కెట్‌కు తరలించే వారిపై కఠిన చర్యలు తప్పవని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) హెచ్చరించారు.

గ్యాస్ కొరతపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, ప్రజలను గందరగోళానికి గురిచేసే వారిపై అధికార యంత్రాంగం కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.

హైలెవల్ కమిటీ ఏర్పాటు

శుక్రవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి ఉత్తమ్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎల్‌పీజీ సరఫరాను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) ఆధ్వర్యంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

గ్యాస్ కొరతపై వస్తున్న వార్తల్లో నిజం లేదని, గృహ వినియోగదారులకు సరిపడా సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని మంత్రి భరోసా ఇచ్చారు. తప్పుడు ప్రచారాల వల్ల కలిగిన ఆందోళనతో గ్యాస్ బుకింగ్స్ ఒక్కసారిగా 72% శాతానికి పెరిగాయని ఆయన వెల్లడించారు.

అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న వారిపై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 288 కేసులు నమోదు చేసినట్లు మంత్రి తెలిపారు. అక్రమ మళ్లింపులను అరికట్టేందుకు నిరంతరం తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

అపోహలను అడ్డుపెట్టుకుని సామాన్యులను ఇబ్బంది పెడితే ప్రభుత్వం ఎంతమాత్రం ఉపేక్షించదని, అక్రమార్కులపై కఠినమైన సెక్షన్ల కింద చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions